అభివృద్ధిని చూసి గులాబీగూటికి చేరుతున్నారు

విప్‌ సునీతా మహేందర్‌ రెడ్డి

యాదాద్రి భువనగిరి,జూన్‌5(జనం సాక్షి): నాలుగేళ్లలో బంగారు తెలంగాణను కళ్లముందు సీఎం కేసీఆర్‌ఆవిష్కరించారని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి పేర్కొన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తూ తెలంగాణను సాధించి అభివృద్ధి చేశారన్నారు. దీంతో ఇప్పుడు దేశం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తుందన్నారు. బొమ్మల రామారం మండలం మైలారం గ్రామంలో ఆలేరు శాసన సభ్యురాలు ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీత మహేందర్‌ రెడ్డి, రైతు విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంగిడి మహేందర్‌ రెడ్డి ఆధ్వర్యంలో 300 ల మంది ఇతర పార్టీల నాయకులు,కార్యకర్తలు తమ పార్టీలకు రాజీనామా చేసి టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా విప్‌ మాట్లాడుతూ అబివృద్దిని కాంక్షించి అనేకులు గులాబీగూటికి చేరుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి 14 ఏళ్లు నిరంతర పోరాటం చేశారన్నారు. రాష్ట్రం ఏర్పాటైన తరువాత ప్రజలు ఏ నమ్మకంతోనైతే ఉద్యమ పార్టీకి అధికారాన్ని అప్పగించారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా సీఎం కేసీఆర్‌ నిరంతరం రాష్ట్ర అభివృద్ధికోసం, ప్రజల సంక్షేమం కోసం పాటుపడుతున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయని అభివృద్ధి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో జరిగిందన్నారు. ప్రజలు చేస్తున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసి తాము ఉంటున్న పార్టీలను వదిలి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారన్నారు. ప్రజలకు కనీస అవసరాలైన రోడ్లు, తాగునీరు, వీధిలైట్లు లాంటి సౌకర్యాలను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా తాను పనిచేస్తున్నానన్నారు. అంతటా రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి జరుగుతోందన్నారు. పార్టీలో చేరిన వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తామన్నారు. వారి ప్రాంతాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నా తక్షణం తన దృష్టికి తీసుకురావాలని, వెంటనే వాటి పరిష్కారానికి మార్గాన్ని చూపిస్తామని చెప్పారు. ఆసరా, ఒంటరి మహిళలకు పింఛన్లు, అమ్మ ఒడి, కేసీఆర్‌ కిట్‌, మిషన్‌కాకతీయ, మిషన్‌ భగీరథ, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ పథకాల వల్ల సామాన్య, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతోందన్నారు.