అభివృద్ధి మా కులం..సంక్షేమం మా మతం
` తెలంగాణకు పట్టిన అతిపెద్ద శని మోడీ
` మోడీ ఎవనికి దేవుడో బండి సంజయ్ చెప్పాలి
` 50 ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ గాడిదపళ్లు తోమిందా?
` ఒక్క చాన్స్ అంటూ మళ్లీ ముందుకు వస్తోంది
` తెలంగాణ ప్రజలు ఈ పార్టీలను నమ్మేస్థితిలో లేరు
` ప్రజలంతా కేసీఆర్ కుటుంబమే..
` స్టేషన్ ఘనాపూర్ సభలో కేటీఆర్
జనగామ(జనంసాక్షి): అభివృద్ది మా కులం..సంక్షేమం మా మతం అని మంత్రి కెటిఆర్ అన్నారు. 50 ఏళ్ల పాలనలో ఏవిూ చేయని కాంగ్రెస్ దద్దమ్మలు మరోమారు ఛాన్స్ అంటూ వస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు పట్టిన శని మోడీ, బిజెపి అంటూ విరుచుకు పడ్డారు. ఏ ఒక్క మంచి పనిచేయకున్నా మోడీని దేవుడని పొగడుతున్న వారిని ఏమనాలని ఎద్దేవా చేశారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గంలో రూ. 125 కోట్లతో పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలు చేసిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. కులం పంచాయతీ లేదు. మతం పిచ్చి లేదు. జనహితమే మా అభిమతం అని కేటీఆర్ స్పష్టం చేశారు. అభివృద్ధే మా కులం, సంక్షేమమే మా మతం అని తేల్చిచెప్పారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు బాగుపడుతున్నాయి. పట్టణాలు బాగు పడుతున్నాయి. దేశంలో అత్యుత్తమ గ్రామాలు, మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయంటే తెలంగాణలో ఉన్నాయని కేంద్రమే చెబుతోంది. కేంద్రం మాటలు చెప్పడం తప్ప ఒక్క పైసా పని చేయలేదని కేటీఆర్ ధ్వజమెత్తారు. కుటుంబ పాలన అంటూ చేస్తున్న విమర్శలపై మరోమారు స్పందించారు. ముమ్మాటికి మాది కుటుంబ పాలనే అని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తేల్చిచెప్పారు. కేసీఆర్‌ను విమర్శిచేందుకు విపక్షాలకు కారణం దొరకట్లేదు. ఏ తప్పు దొరక్క కుటుంబ పాలన అని కేసీఆర్‌ను విమర్శిస్తున్నారు. స్టేషన్ ఘన్‌పూర్ నియోజకవర్గం నుంచి చెబుతున్నా.. మాది కుటుంబ పాలనే అని బరాబర్ చెబుతున్నా అని కేటీఆర్ స్పష్టం చేశారు. కోట్ల మంది తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రతి కుటుంబంలో కేసీఆర్ భాగస్వామినే. రైతులందరికీ పెద్దన్నలాగా కేసీఆర్ అండగా ఉన్నాడు. ఆసరా పెన్షన్లతో వృద్ధులను కడుపులో పెట్టుకున్నాడు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలకు పేదింటి ఆడబిడ్డలకు కేసీఆర్ మేనమామ అయిండు. కేసీఆర్ కిట్ పథకం అమలుతో సర్కార్ దవాఖానాలో ప్రసవాల కోసం క్యూ కడుతున్నారు. గురుకులాల్లో 6 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రపంచంతో పోటీ పడే విధంగా ఆ విద్యార్థులను తయారు చేస్తున్నారు అని కేటీఆర్ తెలిపారు. కొంత మంది రాజకీయ నిరుద్యోగులు పనికిమాలిన పాయదత్రాలు చేస్తూ ప్రజలను రెచ్చగొడుతున్నారు అని కేటీఆర్ ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీకి ఒక్క చాన్స్ ఇవ్వండి అని పార్టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అడుక్కుంటున్నాడు. విూ దిక్కుమాలిన పార్టీకి 10 ఛాన్సులు ఇచ్చారు. విూ హయాంలో కరెంట్, నీళ్లు లేక తెలంగాణ రైతన్న ఆత్మహత్యల పాలయ్యారు. విూ మాటలకు పడిపోయేవారు ఎవరూ లేరు. తెలంగాణలో అమాయకులు ఎవరూ లేరు అని కేటీఆర్ స్పష్టం చేశారు. 50 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తే ఏం చేశారు అని కేటీఆర్ నిలదీశారు. 24 గంటల కరెంట్ రైతులకు ఇవ్వాలన్న సోయి విూకు వచ్చిందా? ఒక్కో ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచన ఎందుకు రాలేదు? రైతులకు బీమా కల్పించాలనే ఆలోచన ఎందుకు రాలేదు? కరెంట్, సాగు, తాగు నీరు ఇవ్వరు.. ఇప్పుడేమో ఎగతాళిగా మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడుక్కుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయని కాంగ్రెస్ కు రేవంత్ రెడ్డి ఒక్క చాన్స్ అడగడం అవివేకమని కేటీఆర్ అన్నారు. హంతకుడే సంతాపం చెప్పినట్లు రేవంత్ రెడ్డి మాటలున్నాయన్నారు. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటను ఎవ్వరూ నమ్మరని చెప్పారు. 50 ఏళ్లు కాంగ్రెస్ కు అధికారం ఇస్తే గుడ్డి గుర్రం పండ్లు తోమారా అంటూ ఎద్దేవా చేశారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఎగిరేది మళ్లీ బీఆర్‌ఎస్ జెండానే అని చెప్పారు. ఇకపోతే ప్రధాని మోడీ ఎవరికి దేవుడు.. ఎందుకు దేవుడని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి అడుగడుగునా అడ్డం పడుతున్నం దుకు మోడీ దేవుడా? అని ప్రశ్నించారు. ఆదానికి దేవుడు కావొచ్చు కానీ.. తెలంగాణ ప్రజలకు దేవుడు కాదన్నారు. బీజేపీకి హిందు.. ముస్లీం తప్ప మరోకటి తెల్వదన్నారు. కిషన్ రెడ్డికి మైండ్ మోకాళ్లలో ఉందో అరికాళ్లలో ఉందో అర్థం కాదని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో పంజాబ్, హర్యానాతో తెలంగాణ రైతుల పోటీ పడుతున్నారు. చెరువులను బాగు చేసి, సాగునీరు అందించి, ఉచిత కరెంట్ ఇవ్వడం ద్వారానే ఇది సాధ్యమైందన్నారు. గతంలో తాగునీరు ఇవ్వకుండా మహిళలను ఇబ్బంది పెట్టారు. కానీ కేసీఆర్ మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందించి, నీటి గొడవలకు స్వస్తి పలికారు అని కేటీఆర్ తెలిపారు. కడియం శ్రీహరి, రాజయ్య తదితరులు పాల్గొన్నారు.