అమిత్‌షా పరిపక్వత ఇంతేనా?

– ట్విట్టర్‌ వేదికగా విరుచుకుపడ్డ కాంగ్రెస్‌ నేత అహ్మద్‌ పటేల్‌
న్యూఢిల్లీ, ఆగస్టు30(జ‌నం సాక్షి) : జేపీసీకి వింత భాష్యం చెప్పిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా పరిజ్ఞానంపై కాంగ్రెస్‌ పార్టీ విమర్శలు గుప్పించింది. విూ పరిజ్ఞానం ఇంతేనా అంటూ నిలదీసింది. జేపీసీ అంటే ‘ఝాటా పార్టీ కాంగ్రెస్‌’ (అబద్ధాల పార్టీ కాంగ్రెస్‌) అంటూ అమిత్‌షా అభివర్ణించడాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ ఓ ట్వీట్‌లో తప్పుపట్టారు. జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)తో దర్యాప్తు జరపించాలని గతంలో పార్లమెంటును స్తంభింపజేసిన వాళ్లే ఇప్పుడు జేపీసీని పరిహసిస్తూ మాట్లాడుతున్నారని, వీరిలో జ్ఞాపక శక్తి లోపించడమే కాదు, పార్లమెంటును పరిహసించేందుకు కూడా వీరు వెనుకాడటం లేదు’ అని విమర్శించారు. జేపీసీ అంటే కుంభకోణాలపై దర్యాప్తునకు ఉద్దేశించిన రాజ్యాంగ నిబంధనే అని, ఆ విషయం తెలుసుకుంటే మంచిదని ఆయన చురకలు వేశారు. ఫేల్‌ డీల్‌పై కాంగ్రెస్‌, రాహల్‌ గాంధీ చెప్పేవన్నీ అబద్ధాలేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ బుధవారం విమర్శించడం, ఇందుకు ప్రతిగా జాయింట్‌ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించమని రాహుల్‌ సవాలు విసరడం, దీనికి అమిత్‌షా స్పందిస్తూ, అబద్ధాల పార్టీ కాంగ్రెస్‌ అంటూ ‘జేపీసీ’కి కొత్త అర్థం చెప్పడం సంచలనమైంది.