అమెరికాతో సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మిస్తాం
` ట్రంప్‌తో భేటికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాను
` అమెరికాలో ప్రధానికి ఘనస్వాగతం పలికిన భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా
` ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై ట్రంప్‌తో చర్చలు
` ఎలన్‌మస్క్‌తోనూ భేటి అయ్యే అవకాశం
` చారిత్రక బ్లెయిర్ హౌజ్‌లో మోడీకి బస
వాషింగ్టన్(జనంసాక్షి): అమెరికాలో రెండు రోజుల పర్యటన కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాషింగ్టన్‌కు చేరుకున్నారు. అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా, ఇతర అధికారులు ప్రధాని మోదీని విమానాశ్రయంలో స్వాగతించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం గురువారం అమెరికాకు చేరుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానం మేరకు ఆయన అమెరికా పర్యటన చేపట్టారు. ఈ క్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి, భారతదేశం-యుఎస్‌ఎ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడానికి ఎదురుచూస్తున్నాను. మన దేశాలు, మన ప్రజల ప్రయోజనం కోసం మెరుగైన భవిష్యత్తు కోసం కలిసి పనిచేస్తూనే ఉంటాయి‘ అని ఆయన పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం తెల్లవారు జామున అమెరికాకు చేరుకున్నారు. ఫ్రాన్స్‌లో తన రెండు రోజుల పర్యటనను ముగించిన తర్వాత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలవడానికి. వారు ప్రతినిధి స్థాయి ఫార్మాట్లలో ద్వైపాక్షిక సమావేశాలను నిర్వహిస్తారు. గురువారం వాషింగ్టన్‌లో అధ్యక్షుడు ట్రంప్‌తో జరిగే సమావేశానికి ముందు మోడీ అదనపు సుంకాల కోతలకు సిద్ధమవుతున్నారు. ఇది భారతదేశానికి అమెరికన్ ఎగుమతులను పెంచవచ్చు.అధ్యక్షుడు ట్రంప్, డోజ్ అధిపతి ఎలాన్ మస్క్‌తో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా మోదీకి భారత సంతతి వారు ఘనంగా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అతిథి గృహంలో బస చేస్తున్నారు. 1651 పెన్సిల్వేనియా అవెన్యూలోని బ్లెయిర్ హౌస్ ఆయనకు ఆతిథ్యం ఇస్తోంది. ఈ భవనం శ్వేత సౌధానికి ఎదురుగా ఉండటం దీని విశేషం. అమెరికాలో పర్యటించే అత్యంత ప్రత్యేకమైన అతిథులకు ఇక్కడ బస ఏర్పాటు చేస్తారు. గతంలో చాలా మంది దేశాధ్యక్షులు, రాజకుటుంబ సభ్యులకు దీనిని విడిదిగా వాడారు. దౌత్యపరంగా ప్రాధాన్యమున్న భవనంగా దీనిని భావిస్తారు. ఇది కేవలం విలాసవంతమైన గెస్ట్‌హౌస్ మాత్రమే కాదు. అమెరికా ఆతిథ్యానికి చిహ్నంగా నిలిచింది. దాదాపు 70 వేల చదరపుటడుగుల్లో నాలుగు భవనాలు అనుసంధానమై ఉండటం దీని ప్రత్యేకత. ఇక్కడ మొత్తం 119 గదులు ఉన్నాయి. వీటిలో 14 బెడ్రూమ్‌లు, 35 బాత్ రూమ్‌లు, మూడు డైనింగ్ గదులున్నాయి. అత్యాధునిక బ్యూటీ సెలూన్ కూడా దీనిలో ఉంది. ఇక్కడి వచ్చిన అతిథులకు ఫైవ్‌స్టార్ ఆతిథ్యం ఇస్తారు. అమెరికా చరిత్రను తెలిపే పురాతన వస్తువులు, ఆర్ట్స్‌తో దీనిని అలంకరించారు. 1824లో ఈ భవనాలను నిర్మించారు. ప్రెస్టోన్ ఫ్రాన్సిస్ బ్లెయిర్ 1837లో కొనుగోలు చేశారు. ఆయన పేరును దీనికి పెట్టారు. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత శ్వేతసౌధానికి అతిథుల తాకిడి గణనీయంగా పెరిగింది. చాలా దేశాధినేతలు, సైన్యాధినేతలు అక్కడే బస చేసేవారు. ఆ తర్వాత 1942లో అమెరికా ప్రభుత్వం ఈ హౌస్‌ను అద్దెకు తీసుకొంది. ఆ ఏడాది చివరి నాటికి 1.56లక్షల డాలర్లకు కొనుగోలు చేసింది. అమెరికా పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ఆ దేశ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసీ గబ్బర్డ్‌తో భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు. డీఎన్‌ఐగా ఆమె నేడు పదవీ బాధ్యతలు చేపట్టడం విశేషం.