అమ్మవారి జాతర ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ

ఆషాఢమాసం ప్రారంభంలోనే గ్రామ దేవతలను  పూజించే సంప్రదాయం తెలంగాణలో ఉంది. అందులో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల్లో మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించుకుంటారు. గోల్గొండలో ఈ నెల 25న ప్రారంభమయ్యే బోనాల పండుగ  నెల రోజుల పాటు కొనసాగుతుంది. అయితే .. గోల్కొండలో జరగనున్న అమ్మవారి జాతరకు ఇప్పటికే అమ్మవారికి మహంకాళి దేవాలయం నుంచి పట్టు వస్ర్తాలు పంపించారు.

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరలో భాగంగా ప్రధాన ఘట్టమైన ఘటోత్సవాలు ఈ నెల 25 నుంచి ప్రారంభించనున్నట్టు ఉజ్జయినీ మహంకాళి దేవాలయ కార్య నిర్వాహణాధికారి ఎస్.అన్నపూర్ణ తెలిపారు. ఆదివారం మధ్యాహ్నాం రెండు గంటలకు దేవాలయం నుంచి భాజాభజంత్రీలతో పసుపు, కుంకుమలతో అమ్మవారి విగ్రహాన్ని కర్భలా మైదానం దగ్గరకు తీసుకు వెళ్లి అక్కడ ఘటం తయారు చేస్తారని తెలిపారు. తర్వాత సాయంత్రం ఏడు గంటలకు కర్భలామైదాన్ నుంచి ఊరేగింపుగా అమ్మవారి ఘటాన్ని దేవాలయానికి తీసుకువస్తారని తెలిపారు. పదిహేను రోజులు బోనాలు, రంగం వేడుకలు నిర్వహిస్తామని తెలిపారు. అమ్మవారి జాతరను పురస్కరించుకొని దేవాలయంలో ఇప్పటికే పనులు ప్రారంభమయినట్టు వివరించారు.

గతేడాది లష్కర్ బోనాల జాతరకు 23 లక్షల మంది భక్తులు హాజరయ్యారని ఈ సారి సుమారు 30 లక్షల వరకు వచ్చే అవకాశం ఉందన్నారు. అమ్మవారి దర్శనం ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. దేవాయలంలో గతేడాది జాతర తర్వాత కొత్తగా ప్రారంభించిన ఐదు రకాల పూజ కార్యక్రమాల్లో భాగంగా దేవాలయానికి కోటికి పైగా ఆదాయం పెరిగిందన్నారు. ఈ సారి బోనాలకు ప్రత్యేక క్యూలైన్‌తో పాటు బోనంతో వచ్చే వారి కోసం కూడా మరో ప్రత్యేక క్యూలైన్ ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. దీంతో ఆలయానికి రావడానికి భక్తులకు మొత్తం ఆరు క్యూలైన్‌లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేవాలయానికి రాలేని భక్తుల కోసం అమ్మవారిని ఇంటింటికి పంపించడమే ఘటోత్సవ ముఖ్య ఉద్దేశ్యమన్నారు.

ఘటోత్సవ పూజా కార్యక్రమాలు

  • జూన్ 25 ఆదివారం ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి ఘటం మధ్యాహ్నాం రెండు గంటలకు దేవాలయం నుంచి బయలు దేరి కర్భలామైదానంలో అలంకరణ పూర్తి చేసుకొని రాత్రి పది గంటలకు దేవాలయానికి చేరుకుంటుంది.
  • సోమవారం (జూన్26) హిమంబావి, డొక్కలమ్మ దేవాలయం ప్రాంతాల్లో ఊరేగిస్తారు.
  • మంగళవారం(జూన్ 27) కళాసీగూడ, 28 బుధవారం నల్లగుట్ట, 29 గురువారం పాన్‌బజార్, 30న ఓల్డ్ బోయిగూడ.
  • జూలై 1వ తేదీ శనివారం రంగ్రేజీ బజార్, 2వ తేదీ చిలకలగూడ, 3వ తేదీ ఉప్పర బస్తీ, 4 వ తేదీ కుమ్మరిగూడ, 5వ తేదీ రెజిమెంటల్‌బజార్, 6వ తేదీ ఘటం దేవాలయంలోనే ఉంటుంది, 7వ తేదీ బోయిగూడ ఏరియాకు ఉదయం పది గంటలకు దేవాయలం నుంచి బయలుదేరి 8వ తేదీ రాత్రి 7 గంటల వరకు చేరుకుంటుంది. తర్వాత 9వ తేదీ బోనాలు, 10వ తేదీ రంగం వేడుకలు జరగనున్నాయి.