అరాఫత్ మరణ రహస్యం
రమల్లా: దివంగత పాలస్తీనా ఉద్యమనేత యాసర్ అరాఫత్ భౌతిక కాయాన్ని ఆయన మరణించిన ఎనిమిదేళ్ల తర్వాత శరీర అవశేషాల పరీక్ష నిమిత్తం వెలికి తీశారు. ఆయన మరణానికి విషప్రయోగమే కారణమన్న బలమైన వాదనల మధ్య శరీర భాగాలను మరోసారి పరీక్షించనున్నట్లు పాలస్తీన వర్గాలు తెలిపాయి. స్థానిక కాలమాణం ప్రకారం మంగళవారం ఉదయం 5గంటలకు ఫ్రెంచి, స్విస్, రష్యా దేశాల నిపుణుల పర్యవేక్షణలో అరాఫత్ భౌతిక కాయపు అవశేషాల సేకరణ జరిగిందని పేర్లు వెల్లడించడానికి ఇష్టపడని పాలస్తీనా వర్గాల ద్వారా తెలిసింది. భౌతికకాయం వెలికితీత, అవశేషాల సేకరణ ప్రక్రియలు అత్యంత గోప్యంగా జరిగాయి. అరాఫత్‌్‌ను చంపేందుకు విషప్రయోగం జరిగిందా.? అనే అంశాన్ని నిర్ణయించేందుకు తాజాగా దర్యాప్తు మొదలైంది. ఆయన భౌతిక కాయపు అవశేషాలలో పొలొనియం అనే రేడియో ధార్మిక పదార్థం ఉన్నదా.? అనేది నిర్ధారించేందుకు పరీక్షలు నిర్వహిస్తారు. 2004లో ఫ్రెంచి ఆసుపత్రిలో ఈ ఉద్యమనేత తుదిశ్వాస విడిచారు. ఆయన భార్య సుహా అందజేసిన ఆయన వ్యక్తిగత వస్తువులు కొన్నింటిని ఒక స్విస్‌లాబ్ ద్వారా పరీక్షించి అల్-జజీరా టీవీ చానల్ స్వతంత్రంగా చేసిన దర్యాప్తులో బయటకొచ్చిన అంశాలు ఈ తాజా దర్యాప్తునకు పురిగొల్పాయి. ఈ క్రమంలో పొలొనియం అనే రేడియో ధార్మిక పదార్థం ఉనికి బయటపడటంతో అరాఫత్ మరణ రహస్యాన్ని ఛేదించేందుకు కసరత్తు మొదలైంది. అరాఫత్ మరణానంతరం ఆయన భార్య సుహా కోరిక మేరకు ఫ్రాన్స్ ప్రభుత్వం విచారణ ప్రారంభించింది. ఈ దర్యాప్తులో భాగమైన ఫ్రెంచి జడ్జీలు ఆదివారమే రమల్లా చేరుకున్నారు.