అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు
హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్యం
* ఓసి జెఎసి నేత పోలాడి రామారావు
కరీంనగర్ బ్యూరో (జనం సాక్షి) :
అగ్రవర్ణాల పేదల సంక్షేమానికి ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళ వారం అసెంబ్లీ ముట్టడికి యత్నించిన రెడ్డి సంఘాల ఐక్యవేదిక నాయకులను నగరంలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని ఓసి సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు తీవ్రంగా ఖండించారు.
గత అసెంబ్లీ ఎన్నికల ప్రణాళికలో, ఇటీవలి హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంలో రెడ్డి వైశ్య కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని కెసిఆర్ హామీ ఇచ్చి మరవడం హాస్యాస్పదం అన్నారు. సీఎం కేసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇటీవలే రాజధాని శివారులో రాష్ట్ర వ్యాప్త భారీ బహిరంగసభ లు నిర్వహించామని పేర్కొన్నారు. పలువురు మంత్రులను కలిసి వినతి పత్రాలు అందజేశామని రామారావు తెలిపారు. స్వయంగా సీఎం కేసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
ఓసి సామాజిక వర్గాలకు సీఎం కేసిఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఓసి సామాజిక సంఘాల సమాఖ్య అధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ 7న అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముట్టడి ఉంటుందన్నారు.
10వ తేదీన రాష్ట్ర రాజధాని ధర్నా చౌక్ వద్ద సమాఖ్య రాష్ట్ర నాయకులతో కలిసి నిరవధిక నిరాహారదీక్ష చేపడుతున్నట్లు పోలాడి రామారావు ప్రకటించారు.