అరెస్టు చేసే దమ్ముందా ?
సీఎం ఇంటి ముందుకొస్తా అరెస్టు చేసుకోండి
చెరసాలలు, నిర్బంధాలకు తెలంగాణ ఉద్యమం భయపడదు
హెదరాబాద్,జనవరి30(జనంసాక్షి) :
ఏదో విధంగా తెలంగాణ ఏర్పాటును అడ్డుకుని, సీమాంధ్ర పెత్తనాన్ని కొనసాగించేందుకు సిఎం కిరణ్ కుమార్ రెడ్డి పాటుపడుతున్నారని రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అడ్డుకునే క్రమంలోనే ఉండవల్ల అరుణ్ కుమారన్ రాజమండ్రి సదస్సు పెట్టి విమర్శలు చేశారని అన్నారు. సీమాంధ్రకు సీఎంగా వ్యవహరిస్తున్న కిరణ్‌కుమార్‌రెడ్డి కి తమను అరెస్టు చేసే దమ్ము, ధైర్యంఉందా అని ప్రశ్నించారు. అరెస్టు చేస్తే తమ తడాఖా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ఎప్పుడు అరెస్టు చేస్తారో చెబితే సీఎం
ఇంటికే వెళ్తామని ఆయన తేల్చిచెప్పారు. తమను అరెస్టు చేసి జైల్లో పెట్టినంత మాత్రాన ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. ప్రజాజీవితంలో ఉండే నేతలపై విమర్శలు సహజమన్నారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఒక్కరూ సమానమని, ఎవరు తప్పుచేసినా వారిపై విమర్శలు చేయడం తప్పేవిూ లేదన్నారు. కేసులు పెట్టి జైలుకు పంపితే ఉద్యమం ఆగుతుందనుకుంటే మూర్ఖత్వమేనని కోదండరాం అన్నారు. తమను అరెస్టు చేయాలని ముఖ్యమంత్రికి సవాలు విసురుతున్నానని, ఎప్పుడు అరెస్టు చేస్తారో చెబితే ముఖ్యమంత్రి ఇంటికే వెళ్తామని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో టీ మంత్రులు పనికిమాలిన కూతలు కూస్తున్నారని కొల్లాపూర్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జూపల్లి కృష్ణారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి పదవులకు రాజీనామా చేయకుండా తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. తెలంగాణ మంత్రులు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని టిఆర్‌ఎస్ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో మండిపడ్డారు. మంత్రి పదవి వచ్చిన తరవాత జానారెడ్డి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాహుల్‌ను ప్రధాని చేయడానికి కాంగ్రెస్ నాయకులు గులాంగిరి చేస్తున్నారని ఆగ్రహం వెలిబుచ్చారు. వెయ్యి మంది బిడ్డల చావులకు కారణమైన కాంగ్రెస్‌పై 302 సెక్షన్ కింద కేసు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని వాళ్లను ద్రోహులనకు ఇంకేమంటారు అని ప్రశ్నించారు. విప్ జగ్గారెడ్డిపై ఆయన నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి జగ్గారెడ్డికి లేదని తేల్చిచెప్పారు. మొదట ఆయన భాష, వేషం మార్చుకోవాలని సూచించారు.
మంత్రులకు వెన్నెముకలేదు:యాదవరెడ్డి
సీమాంధ్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి గులాంగిరి చేస్తున్న తెలంగాణ మంత్రులపై ఎమ్మెల్సీ యాదవరెడ్డి ధ్వజమెత్తారు. టీ మంత్రులకు వెన్నెముక లేదని విమర్శించారు. కేసీఆర్‌ను సీఎం విమర్శిస్తుంటే ఆయన పక్కనే కూర్చున్న టీ మంత్రులు తెలంగాణవాదులు అవమాన పరిచారని ఆవేదన వ్యక్తం చేశారు.ఫిబ్రవరి 8న తెలంగాణ ఎమ్మెల్యేలం సమావేశం అవుతున్నామని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చే విధంగా చివరి ప్రయత్నం చేస్తామని ఎమ్మెల్యే భిక్షమయ్యగౌడ్ తెలిపారు. అనంతరం మంత్రులు, ఎంపీలతో కలిసి హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభ ఏర్పాటు- చేస్తామని, సభకు షిండే, ఆజాద్, బొత్స సత్యనారాయణను ఆహ్వానిస్తామని పేర్కొన్నారు.