అర్హులైన ప్రతీ ఒక్కరికి..
డబుల్‌బెడ్ రూం ఇల్లిస్తాం
– సిద్ధిపేట, గజ్వేల్, దుబ్బాకలో ఇళ్ల నిర్మాణం పూర్తవుతుంది
– ఈనెల 9 నుంచి 12వరకు దరఖాస్తులు స్వీకరిస్తాం
– ఆగస్టు చివరిలోపు లబ్ధిదారులకు ఇండ్లు అందిస్తాం
– రాష్ట్ర భారీనీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు
సిద్దిపేట, జులై6(జనం సాక్షి ) : అర్హులైన ప్రతీ ఒక్క పేదవానికి డబుల్‌బెడ్‌రూం ఇల్లు అందిస్తామని, కొంత సమయం తీసుకున్నా.. ఖచ్చితంగా ఇల్లు ఇచ్చి తీరుతామని రాష్ట్ర భారీనీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం మంత్రి సిద్ధిపేటలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. త్వరలోనే పేదల కల నెరవేరబోతుందని తెలిపారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాకలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తి కావచ్చాయని, నిజమైన పేదలకు అత్యంత పారదర్శకంగా ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు. రాజకీయ ప్రమేయం లేకుండా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక పక్రియ జరుగుతుందన్నారు. సిద్దిపేటలో 1960, గజ్వేల్‌లో 1300, దుబ్బాకలో 1000, హుస్నాబాద్‌లో 400 ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. దరఖాస్తుల కోసం పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికీ ఒక్క రూపాయి కూడా లంచం ఇవ్వొద్దని కోరారు. అధికారులు తప్పు చేస్తే ఉద్యోగం నుంచి తొలగిస్తామన్నారు. ఎవరైనా డబ్బులు తీసుకుంటే వెంటనే అరెస్ట్ అవుతారని హెచ్చరించారు. ఈ ఇండ్ల కేటాయింపులకు గాను ఈనెల 9 నుంచి 12 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. దరఖాస్తుల పరిశీలన ఈనెల 16 నుంచి ఆగస్టు 5వరకు ఉంటుందని తెలిపారు. ఆగస్టు చివరిలో లబ్ధిదారులకు ఇండ్లు అందిస్తామని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్వాంగులకు.. ఇలా ఎవరి కోటా వారికి కేటాయిస్తామని వెల్లడించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టి ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికే రోల్ మోడల్‌గా ఉన్నారని హరీశ్‌రావు తెలిపారు.
7సీట్స్ బ్యాటరీ కారు ప్రారంభించిన మంత్రి…
జిల్లా కేంద్రంలోని కోమటిచెరువును మినీ ట్యాంక్‌బండ్‌గా తీర్చిదిద్దుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా మినీ ట్యాంక్‌బండ్‌పై 7 సీటర్ బ్యాటరీ కారును రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు శుక్రవారం ఉదయం ప్రారంభించారు. బ్యాటరీ కారును స్వయంగా మంత్రే డ్రైవ్ చేశారు. ఈ సందర్భంగా కోమటి చెరువు సుందరీకరణ పనులపై అధికారులు, మున్సిపల్ చైర్మన్ రాజనర్సుతో మంత్రి హరీశ్ సవిూక్ష నిర్వహించారు. మినీ ట్యాంక్‌బండ్ సుందీకరణ పనులను త్వరగా పూర్తి చేయాలని టూరిజం, ఇరిగేషన్, మున్సిపల్ శాఖ అధికారులకు మంత్రి సూచించారు. మంత్రి వెంట సుడా చైర్మన్ మారెడ్డి
రవీందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు.