అలహాబాద్‌ నగరానికి పేరుమార్చాలి

– మోదీ ఆమేరకు నిర్ణయం తీసుకోవాలి
– బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి
న్యూఢిల్లీ, జులై10(జ‌నం సాక్షి ) : ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌ నగరానికి ప్రయాగగా పేరు మార్చాలన్న డిమాండ్‌కు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మద్దతిచ్చారు. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ చొరవ తీసుకోవాలని కోరారు. మంగళవారం విూడియాతో ఆయన మాట్లాడుతూ ‘ప్రధాని మోదీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అహ్మదాబాద్‌ పేరును కర్ణావతిగా మార్చాలని కేంద్రానికి ఆయన సిఫారసు పంపారు. ఇవాళ ఆయన ప్రధానిగా ఉన్నారు. ఆయన ఒక్కసారి తలుచుకుంటే చాలు…పేరు మార్పు జరిగిపోతుంది. మరి ప్రధాని ఎందుకు ఆ పని చేయడం లేదు?’ అని స్వామి ప్రశ్నించారు. మొఘల్‌ పాలకులు, బ్రిటిషర్ల హయాంలో పేర్ల మార్పులు జరిగాయని, ఇప్పుడు వాటిని తొలగించి పాతపేర్లను అమల్లోకి తేవాలని కూడా స్వామి డిమాండ్‌ చేశారు. వచ్చే ఏడాది కుంభమేళా నేపథ్యంలో అలహాబాద్‌కు ప్రయాగగా పేరు మార్చాలని ఉత్తరప్రదేశ్‌ ఆరోగ్య శాఖ మంత్రి సిద్ధార్థ్‌ నాథ్‌ సింగ్‌ ఇప్పటికే గవర్నర్‌ నామ్‌ నాయక్‌ను కోరారు. అలహాబాద్‌లో ప్రవిత్ర స్థలంగా భావించే ప్రయోగలో మూడు నదులు- గంగ, యమున, సరస్వతి ప్రవహిస్తున్నాయి. 12 ఏళ్లకు ఒకసారి జరిగే కుంభమేళా-2019కి ప్రయాగ వేదిక కాబోతోంది. ఈ నేపథ్యంలో అలహాబాద్‌కు బదులుగా ప్రయాగ సీటిగా పేర్కొంటూ రాబోయే కుంభమేళాలో బ్యానర్లు వెలవనున్నాయంటూ కథనాలు వెలువడుతున్నాయి.