అవినీతికి రాజముద్ర!
మంత్రులకు న్యాయ సహాయంపై శంకర్‌రావు వ్యాఖ్య
హైదరాబాద్ : వివాదాస్పద ఇరవై ఆరు జీవోలను జారీ చేయడంలో భాగస్వామ్యమున్న మంత్రులకు న్యాయసహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అవినీతికి రాజముద్ర వేయడమేనని మాజీ మంత్రి పి. శంకర్‌రాబు వ్యాఖ్యానించారు. జగన్ ఖాతాలో డబ్బులు చేరడానికి కారుకులైన వారిని రక్షించే విధంగా ప్రభుత్వ చర్య ఉందని శనివారం ఆయన విలేకరుల సమావేశంలో విమర్శించారు. తప్పు చేసిన వారికి న్యాయ సహాయం ఇప్పించి జైలులో మగ్గుతున్న అమాయకులైన అధికారులను వదిలి వేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పార్టీ ప్రభుత్వ ప్రతిష్ట మరింత దిగజారకుండా ఉండేందుకు రాష్ట్రపతి ఎన్నికలు కాగానే ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్‌రెడ్డిని పదవి నుంచి తప్పించాలని ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విజ్ఞప్తి చేశారు. కాగా దివంగత వైఎస్. రాజశేఖరరెడ్డి జయంతిని పార్టీ, ప్రభుత్వ పరంగా నిర్వహించాలని ఆయన కోరారు. ఆదివారం వైఎస్ జన్మదినం అని గుర్తుచేస్తూ ఆయన సోనియాకు లేఖ రాశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో యూపీఏ అభ్యర్థిగా పోటీలో నిలిచిన ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ప్రకటించాలని ఆయన వైకాపా గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డిని కోరారు.