అవినీతిని నిరూపించండి

5

– రాజకీయాల నుంచి తప్పుకుంటా

– విపక్షాలకు  కేటీఆర్‌ సవాల్‌

ఆదిలాబాద్‌,అక్టోబర్‌ 19(జనంసాక్షి): రాష్ట్రంలో తమ ప్రభుత్వం కేవలం ప్రజల బాగోగులకోసం మాత్రమే దృష్టి పెట్టి వివిద పథకాలను ప్రారంబిస్తుందే తప్ప, కాంట్రాక్టర్లకోసమో, రాజకీయ నాయకుల జేబులు నింపేందుకు ఎంతమాత్రం కానే కాదని, ప్రతిపక్షాలు గొంతెత్తి అరవడం మానేసి దమ్ముంటే అవినీతిని నిరూపించాలని రాష్ట్ర పంచాయితీరాజ్‌ ఐటీ శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు సవాల్‌ విసిరారు. సోమవారం ఆయన ఆదిలాబాద్‌ జిల్లా దిలావార్‌ పూర్‌ మండలం మోడేగాంలో వాటర్‌ గ్రిడ్‌ పైలాన్‌ను ప్రారంభించారు. ఈసందర్బంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడుతూ ఓపెద్దాయన వాటర్‌గ్రిడ్‌లో అవినీతి జరిగిందని అంటుండు…త్వరలోనే బయట పెడతానంటున్నారు. ఆయనకు ఇదే వేదిక విూదుగా సవాల్‌ విసురుతున్నా… దమ్ము, ధైర్యం ఉంటే అవినీతిని బయటపెట్టాలి.. అప్పుడు ఖచ్చితంగా రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. తాము కాంగ్రెస్‌, టీడీపీ నేతల్లాగా  తప్పుడు పనులను చేసే అవకాశమేలేదన్నారు. కాంట్రాక్టర్లకోసం ఏనాడూ ప్రాజెక్టులు రూపొందించలేదన్నారు. పంచాయితీరాజ్‌ శాఖపై సీఎం కేసీఆర్‌ పెట్టిన నమ్మకాన్ని తాను  వమ్ము చేయనన్నారు. తెలంగాణాకోసం జైలుకుపోయింది టీఆర్‌ఎస్‌, పదవులు పట్టుకుని వేలాడిందికాంగ్రెస్‌ అన్న విషయం ప్రజలందరికి తెలిసిన విషయమన్నారు. ఎంతమంది కారుకూతలు కూసినా రైతులు ఆదైర్య పడొద్దన్నారు. కాంగ్రెస్‌ నేతలు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు రైతులకు భరోసా ఇచ్చి ఉంటే నేడు భరోసా యాత్రలు చేయాల్సినవసరం ఉండేది కానే కాదన్నారు. వచ్చే ఎండాకాలం నుంచి పగటిపూట 9గంటల విద్యుత్‌ ఇచ్చి తీరుతామన్నారు. గ్రామపంచాయితీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలకు నూతన భవనాలను నిర్మిస్తామన్నారు. 60 ఏండ్లలో చేయని అభివృద్దిని 60 నెలల్లో చేసి చూపిస్తామన్నారు. తెలంగాణా ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టుల్లో వాటర్‌గ్రిడ్‌ ముఖ్యమైనదన్నారు. ప్రతి ఇంటికి కూడా నల్లా ద్వారానే నీటిని అందించడానికి తాము భగీరథ ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఖచ్చితంగా వాటర్‌గ్రిడ్‌ ద్వారా మూడేళ్లో నీరు అందించి తీరుతామన్నారు.  ఎన్నికలకు ముందు నల్లా నీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడుగనని చెప్పిన దమ్మున్న సీఎం ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ మాత్రమేనన్నారు. ప్రతి ఒక్కరి సహకారంతోనే ఈప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు. దేశంలో ఏరాష్ట్రం చేయని సాహసాన్ని టీఆర్‌ఎస్‌ సర్కార్‌ చేసిందన్నారు. 35వేల కోట్లను ఖర్చు చేసి తాగునీరిస్తా ఉంటే కేంద్రం నయాపైసా కూడా ఇవ్వడానికి ముందుకు రావడంలేదని ఆరోపించారు.  వాటర్‌ గ్రిడ్‌కోసం ఇప్పటికే పలు సంస్థలు 20 వేల కోట్ల రుణాలిచ్చాయన్నారు. 2050 నాటి వరకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటర్‌ గ్రిడ్‌ను డిజైన్‌ చేశామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 25వేల కిలో విూటర్ల పైప్‌ లైన్లు వేయాల్సి ఉందన్నారు. 50 నీటి శుద్ది కేంద్రాలు ఏర్పాటు చేయల్సి ఉందన్నారు. ప్రతి ఇంటికి రోజుకు వంద లీటర్ల నీరు ఇస్తామన్నారు. ఈకార్యక్రమంలో పాల్గోన్న బీసీ సంక్షేమం, అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ అన్నదాతను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందన్నారు. రైతు ఆత్మహత్యలకు ముమ్మాటికి కాంగ్రెస్సే ప్రధాన కారణమని ఆరోపించారు. వారుచేసిన పాపాలను కడిగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషిచేస్తున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 6 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లిస్తున్నామన్నారు. 60 ఏళ్లు పాలించి రైతులకు ఏమి మేలు చేశారో చెప్పేందుకు విూవద్ద  మాటలున్నాయా అని మంత్రి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ను విమర్శిస్తున్న జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల చరిత్ర ఎవరికి తెలువదనుకుంటున్నారేమో విూ విూ ప్రాంతాల్లోనే విూ బతుకులు బయట పెడతాం జాగ్రత్తంటూ హెచ్చరించారు. ఫ్లోరైడ్‌ గ్రామాలకు తాగునీరందించలేని చరిత్ర జానారెడ్డిదన్నారు. ప్లోరైడ్‌ సమస్యను అరికట్టలేని అసమర్థులు కాంగ్రెస్‌ పార్టీ నేతలన్నారు. వారి పాపాల వల్లనే పేదలకు ఇండ్లు రాలేదన్నారు. తెలంగాణా సర్కార్‌ చేపడుతున్న కార్యక్రమాలను జీర్ణించుకోలేకనే యాత్రల పేరుతో తిరుగుతున్నారన్నారు. మరో మంత్రి దేవాదాయ, న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి మాట్లాడుతూ రాబోయే మూడేళ్లలో ప్రతి ఒక్కరికి ఇంటింటికి నల్లా నీటీని అందించి తీరుతామన్నారు. ఆదిలాబాద్‌ను అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్‌ చిత్తశుద్దితో కృషిచేస్తున్నాడన్నారు. రైతులకు మార్చినుంచి పగటి పూటే 9 గంటల విద్యత్‌ ఇచ్చి తీరుతామన్నారు. ఫిబ్రవరి నాటికే రాష్ట్రంలో ప్రధానంగా ఆదిలాబాద్‌ జిల్లాలో నిర్మిస్తున్న సింగరేణి విద్యుత్‌  1200 మెగావాట్ల విద్యుత్‌ అందుబాటులోకి వస్తుందన్నారు. మిషన్‌ కాకతీయతో చెరువులు కలకలలాడుతున్నాయన్నారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జగన్‌మోహన్‌తోపాటు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.