అవినీతిపై మాట్లాడరేం?
– మహానాడులో అవినీతిపై తీర్మానం చేయాల్సింది
– దేశంలోనే అత్యాచారాల్లో ఏపీది రెండవస్థానం
– బాబు నాలుగేళ్లలో ఏం చేశారో చెప్పలేకపోతున్నాడు
– 2019లో గుణపాఠం తప్పదు
– చంద్రబాబు ప్రభుత్వంపై సి. రామచంద్రయ్య విమర్శలు
కడప, మే29(జనం సాక్షి) : రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, అవినీతిలో రెండుమూడు స్థానాల్లో ఏపీ నిలిచిందని, అదేవిధంగా అత్యాచారాల్లో దేశంలోనే ఆంధప్రదేశ్ రెండో స్థానంలో ఉండటం సిగ్గుచేటని మాజీ మంత్రి సి. రామచంద్రయ్య మండిపడ్డారు. వీటిపై మహానాడులో టీడీపీ నేతలు మాట్లాడాలని డిమాండ్ చేశారు. మహిళలపై అకృత్యాలు పెరుగుతున్నా చంద్రబాబు ప్రభుత్వం వాటిని అరికట్టలేకపోతుందని విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. మహిళా ఎమ్మార్వోపై టీడీపీ నేతలు దాడి చేసినపుడు వారిని వెనకేసుకొచ్చిన చంద్రబాబు నుంచి ఇంతకన్నా ఏం ఆశించగలమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే మద్య నిషేధం చేస్తానన్న చంద్రబాబు.. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయం మర్చిపోయారని ఎద్దేవా చేశారు. బాబు వస్తే జాబు.. జాబు లేకపోతే నిరుద్యోగ భృతి అంటూ హావిూ ఇచ్చారని అయితే ఇంతవరకు ఒక్క హావిూ కూడా నెరవేర్చలేదని రామచంద్రయ్య మండిపడ్డారు. ఒకపక్క కరువు రహిత రాష్ట్రం అని గొప్పలు
చెప్పుకుంటూనే మరో పక్క కరువు మండలాలు ప్రకటిచండం చంద్రబాబుకే చెల్లిందంటూ ఎద్దేవా చేశారు.
మహానాడుకు ప్రజల సొమ్మును వాడుతున్నారు.. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యక్రమాలు, అధికారిక కార్యక్రమాలకు తేడా లేకుండా పోయిందని రామచంద్రయ్య విమర్శించారు. మహానాడుకు ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ సొంత డబ్బా కొట్టుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అవినీతిపై నిలదీస్తే ప్రతిపక్షాలు అభివృద్ధికి అడ్డుపడుతున్నాయంటూ ఎదురుదాడి చేస్తారని విమర్శించారు. రాజధాని పేరిట రైతుల నుంచి 33 వేల ఎకరాలు లాక్కుని వారికి ఇంతవరకు న్యాయం చేయలేదని రామచంద్రయ్య ఆరోపించారు. అవినీతికి పాల్పడుతున్న చంద్రబాబు ప్రభుత్వం.. మహానాడులో అవినీతిపై కూడా ఒక తీర్మానం చేసి ఉంటే బాగుండేదని ఆయన ఎద్దేవా చేశారు. 2019లో ప్రజలంతా చంద్రబాబు అవినీతిని అంతమొందిచేందుకు సిద్ధమవుతున్నారని, గుణపాఠం తప్పదని అన్నారు.