అవినీతి వల్లే మేడిగడ్డ కుంగింది

` నేడు ప్రాజెక్టును సందర్శించనున్న రాహుల్‌
` కులగణనతోనే బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి
` అధికారంలోకి రాగానే మొదటగా జాతీయ కుల గణన చేపడతాం
` సీఎం కేసీఆర్‌ అవినీతి సొమ్మును కక్కిస్తాం.. ప్రజల అకౌంట్లలో వేస్తాం..
` రెండు శాతం ఓట్లు లేని బీజేపీ.. ఓబీసీని సీఎం చేస్తుందా?
` విజయభేరి యాత్రల్లో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ
మహబూబ్‌నగర్‌/షాద్‌నగర్‌, నవంబర్‌ 1 (జనంసాక్షి):కులగణనపైనే బీసీ, ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి ఆధారపడి ఉందని, తాము అధికారంలోకి రాగానే మొదటగా జాతీయ కుల గణన చేపడతామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. దేశాన్ని ఏలేవారిలో ఓబీసీల స్థానం ఎంత ఉందని తాను ప్రశ్నించినట్టు తెలిపారు. 90 మందిలో కేవలం ముగ్గురు మాత్రమే ఓబీసీ అధికారులున్నారని, అందుకే ఓబీసీ, దళితులు, గిరిజనుల లెక్క తేలాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ సర్కారు దోచుకున్న సొమ్మును కక్కిస్తామని, ఆ డబ్బును ప్రజల అకౌంట్లలో వేసేందుకు ప్రయత్నిస్తామని హామీనిచ్చారు. ప్రస్తుతం దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని రాహుల్‌ అభివర్ణించారు. కల్వకుర్తి, షాద్‌నగర్‌ నియోజకవర్గాల్లో జరిగిన విజయభేరి యాత్రలో రాహుల్‌ మాట్లాడారు.
ప్రత్యేక తెలంగాణ కోసం ప్రజలు కలలుగన్నారని.. అయితే తెలంగాణ ఏర్పాటు తర్వాత ఒక కుటుంబానికే మేలు జరిగిందని కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. ఉద్యోగాలు, పదవులు అన్నీ ఒకే కుటుంబానికి దక్కాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కేసీఆర్‌ కుటుంబం రూ.లక్ష కోట్లు దోచుకుంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నో భారీ ప్రాజెక్టులను నిర్మించింది. ప్రాజెక్టుల ద్వారా నిర్వాసితులైన ప్రజలకు ఇళ్లు, భూములు ఇచ్చాం. ధరణి పోర్టల్‌ తీసుకొచ్చి పేదల భూములను లాక్కున్నారు. ఈ పోర్టల్‌ ద్వారా 20 లక్షల మంది రైతుల భూములు లాక్కున్నారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములనూ లాక్కున్నారు. ఓబీసీని ముఖ్యమంత్రిని చేస్తానని భాజపా చెబుతోంది. రెండు శాతం ఓట్లు వచ్చే భాజపా ఓబీసీని సీఎం ఎలా చేస్తుంది? భాజపా మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. రాష్ట్రాభివృద్ధి కోసం మహిళలు ఎంతో కష్టపడుతున్నారు. రాష్ట్రం కోసం, కుటుంబం కోసం కష్టపడే మహిళలకు న్యాయం జరగాలి. అందుకే మహిళలకు ప్రతినెలా రూ.2500 ఖాతాల్లో వేస్తాం. కేంద్రంలోని భాజపా సర్కార్‌ గ్యాస్‌ సిలిండర్‌ను రూ.వెయ్యికి పెంచింది. కాంగ్రెస్‌ గెలిస్తే.. రాష్ట్రంలో రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ వస్తుంది’’ అని రాహుల్‌ గాంధీ వివరించారు.
సీఎంను ఎలా చేస్తారో..?
తెలంగాణలో 2శాతం కూడా ఓట్లు తెచ్చుకోలేని బీజేపీ పార్టీ ఓబీసీని సీఎం ఎలా చేస్తుందోనని రాహుల్‌ ప్రశ్నించారు. వీళ్ల తీరు ఎలా ఉందంటే.. అమెరికా అధ్యక్షుడిగా ఓబీసీ వ్యక్తిని మోదీ అమెరికా వెళ్లి చెప్పినట్లుందన్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌, అసోం, ఉత్తర్‌ ప్రదేశ్‌ ఎక్కడైనా కాంగ్రెస్‌ పోటీ చేస్తే, అక్కడ ఎంఐఎం అభ్యర్థులు ప్రత్యక్షం అవుతారు. వాళ్లంతా అక్కడ బీజేపీ అభ్యర్థులకు సాయపడడానికి వస్తారు. ఈ ఎంఐఎం వాళ్లకు డబ్బులు కూడా బీజేపీనే ఇస్తుంది. 28 రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు ఎంఐఎంకు డబ్బులు ఎక్కడ్నుంచి వస్తున్నాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎంఐఎం ` బీజేపీ ` బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒకటే శక్తి అని ఆరోపించారు. మోడీ, బీజేపీ దేశంలో విద్వేషం పెంచేందుకు కుట్రలు చేస్తోందన్నారు. అయినా తెలంగాణ, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌గఢ్‌లో కూడా గెలవబోతున్నామని, తర్వాత కేంద్రంలోనూ గెలుస్తామని దీమా వ్యక్తం చేశారు. అందరం కష్టపడి ఇక్కడ బీఆర్‌ఎస్‌ను ఓడిద్దాం. జనరల్‌ ఎన్నికల్లో బీజేపీని ఓడిద్దాం అని రాహుల్‌ గాంధీ పిలుపు ఇచ్చారు.

 

తాజావార్తలు