అసంఘటితరంగ కార్మికులను పట్టించుకోండి

విజయవాడ,మే28(జ‌నం సాక్షి): అసంఘటిత పారిశ్రామిక కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టాలని సిఐటియు నేతలు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నాలుగేళ్లుగా వేతన బోర్డు వేయకపోవడంతో 2012లో నిర్ణయించిన వేతనాలతోనే కార్మికులు సరిపెట్టుకోవాల్సి వస్తోందని అన్నారు.  పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచుకునే మంత్రి మండలికి కార్మికుల వేతనాల గురించి పట్టకపోవడం సిగ్గుచేటని సీఐటీయూ నేతలు  ధ్వజమెత్తారు.  2012 నుంచి వేతన సవరణ జరగకపోవడం అన్యాయమని, దీంతో కార్మికులు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. కార్మిక చట్టాలకు సవరణలు చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక హక్కులను హరిస్తున్నాయని విమర్శించారు. కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు జూన్‌ 4 నుంచి 15 వరకు సమస్యల పరిష్కారం కోసం చేసే బైక్‌ ర్యాలీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు.
——-