అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం
– రాష్ట్రం వస్తుందని తొలుత ఎవ్వరూ నమ్మలేదు
– 24గంటల విద్యుత్ ఇస్తామంటే జానారెడ్డే విమర్శించారు
– నాలుగేళ్లలో అన్నింటిని అధిగమించాం
– ఏంచేశావని అమిత్‌షా, మోదీ అడుగుతున్నారు
– దేశంలో 19రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉంది
– ఎక్కడైనా 24గంటలు ఇస్తున్నారా?
– అదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో ఆపద్ధర్మ సీఎం కేసీఆర్
అదిలాబాద్, నవంబర్29(జనంసాక్షి) : తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టిన సమయంలో ప్రత్యేక రాష్ట్రం వస్తుందన్న నమ్మకం ఎవ్వరికీ లేదని కేసీఆర్ తెలిపారు. అతికొద్ది మందికి మాత్రమే ప్రత్యేక రాష్ట్రం సాధించగలమన్న విశ్వాసం ఉండేదన్నారు. దేవుడి దయ, ప్రజల ఆకాంక్షలతోనే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్నారు. ఆదిలాబాద్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని మాట్లాడుతూ..
రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ను అందిస్తామంటే స్వయంగా ఇక్కడి కాంగ్రెస్ నేత కె.జానారెడ్డి ‘ఎట్లా చేస్తరయ్యా’ అంటూ ప్రశ్నించారని గుర్తుచేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం గత నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధి కళ్ల ముందు ఉందన్నారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఆలోచించి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్, టీడీపీ 58 ఏళ్ల పాలనలో ఓసారి పంట వేస్తే.. మూడుసార్లు మోటార్లు కాలిపోయేవని గుర్తుచేశారు. పిచ్చి మాటలు మాట్లాడితే, చెక్కలిగింతలు పెడితే 24 గంటలు కరెంట్ రాలేదనీ, అవిశ్రాంతంగా పనిచేస్తేనే అది సాధ్యమయిందని వ్యాఖ్యానించారు. గత పాలకులు చేనేత, గీతకార్మికుల పొట్ట కొట్టారని విమర్శించారు. తెలంగాణలో యాదవుల కోసం 75లక్షల గొర్రెలు తెచ్చి పంచామని కేసీఆర్ తెలిపారు. వాటికి 40లక్షల పిల్లలు పుట్టాయన్నారు. తద్వారా రాష్ట్రంలోని గొల్ల, కురుమ సామాజికవర్గం ప్రజలు రూ.1,500 కోట్ల ఆదాయాన్ని అర్జించారని ముఖ్యమంత్రి అన్నారు. బంగారు తెలంగాణ అన్నది టీఆర్‌ఎస్ తోనే సాధ్యమని కేసీఆర్ పునరుద్ఘాటించారు.
మినీ టెక్స్‌టైల్స్ ఏర్పాటు చేస్తాం..
పద్మశాలిల కోసం కొన్ని పనులు కావాలని జోగురామన్న నన్ను కోరారని, ఎన్నికల తర్వాత మిమ్మల్ని హైదరాబాద్‌కు పిలిపించుకుని మినీ టెక్స్‌టైల్స్‌తోపాటు ఇంకా ఏమి కావాలో చేస్తాననికేసీఆర్ హావిూనిచ్చారు. ఇక్కడ గిరిజనుల పోడు భూముల సమస్యలున్నాయని, గిరిజన ప్రాంతాల్లో ఉన్న గిరిజనేతులకు కూడా కొంతమందికి రైతుబంధు అమలుచేశామన్నారు. ఉద్యమ సమయంలో సామల
సదాశివసార్ ఇంటికి ఒకసారి వెళ్లానని, సదాశివసార్‌తో ఉద్యమం గురించి మాట్లాడానని, కొన్ని విషయాలు గట్టిగా అంటే కొందరికి నచ్చదు అని సదాశివసార్ చెప్పేటోడన్నారు. గతంలో ఎన్నికల్లో నిలబడ్డ ప్రతీ ఒక్కరు లోయర్ పెన్‌గంగా పేరు చెప్పుకోవాలే, ఓట్లు దొబ్బుకొని అవుతల పడాలేనని కేసీఆర్ మండిపడ్డారు. టీఆర్‌ఎస్ వచ్చిన తర్వాత నేను, జోగురామన్న, ఎంపీ నగేశ్ మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని ఒప్పించి చనాకా కొరాట బ్యారేజీ కడుతున్నామని అన్నారు. త్వరలోనే అది పూర్తవుతుందని తెలిపారు. అది అయిపోతే నికరంగా 50వేల ఎకరాలకు నీళ్లు వస్తాయని, సాత్నా వాగు విూద చెక్‌డ్యాం కట్టాలన్నారు. సాత్నాలా మండలం, సోనాలా మండలం చేయాలని అడిగారని, ప్రభుత్వం వచ్చిన నెల రోజుల్లో ఆ మండలాలు ఏర్పాటు చేస్తామని కేసీఆర్ హావిూ ఇచ్చారు. నిన్న అమిత్‌షా, మొన్న మోదీ వచ్చారని, తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజనులు, ముస్లింల శాతం పెరిగిందని, గిరిజనులు, ముస్లిం రిజర్వేషన్లు కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. ప్రధాని మోదీ రిజర్వేషన్లను చేయబోమని అన్నడని కేసీఆర్ చెప్పారు. అమిత్ షా కమ్యూనిటీ హాల్ గురించి, ప్రధాని నిజామాబాద్‌లో మోరీలు కూడా లేవని మాట్లాడుతున్నారని, ప్రతీఊరిలో విూరు చర్చ పెట్టాలని, నేడు భారత్‌లోనే 19రాష్ట్రాల్లో విూ పార్టీ అధికారంలో ఉందని, ఒక్క రాష్ట్రంలోనైనా రైతులకు 24గంటలు ఇస్తారా.. అపని ప్రశ్నించారు. రైతులకు ఒక రూపాయి అయినా మాఫీ చేశారా? ఒంటరి మహిళలకు పెన్షన్ ఇచ్చే దమ్ముందా అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పథకాలను అమలు చేస్తున్నామని కేసీఆర్ అన్నారు.