అసెంబ్లీలో మిన్నంటిన జై తెలంగాణ

తీర్మానానికి టీఆర్‌ఎస్‌ సభ్యుల పట్టు
తెరాస సభ్యుల ఒక్కరోజు సస్పెన్షన్‌
హైదరాబాద్‌,మార్చి18 (జనంసాక్షి) ః
రాష్ట్ర అసెంబ్లీలో ఈరోజు ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా తీర్మానాలను స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ తిరస్క రించారు. తెలంగాణా తీర్మానం కోసం టిఆర్‌ఎస్‌, ధరల పెరుగుదలపై చర్చకు టిడిపి చర్చకు పట్టుబట్టి స్పీకర్‌ పోడియం చుట్టుముట్టి ప్రభుత్వానికి
వ్యతిరేకంగా నినదించారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు తమ పట్టు వీడ బోమన్నారు. అలాగే వస్త్రవ్యాపారులపై విధించిన వ్యాట్‌ను రద్దుచేయాలని డిమాండ్‌ చేస్తూ ప్లకార్డులను పట్టుకుని వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేలు తీర్మానం ఇచ్చి చర్చకు పట్టుబట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. అయితే వాయిదా తీర్మాణాలను తిరస్కరించడం జరిగిందని ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సహకరించాలని స్పీకర్‌ కోరారు. అయితే స్పీకర్‌ వినతిని వీరు ఖాతరు చేయకుండా ఎంతమాత్రం వెనక్కితగ్గలేదు. ఈక్రమంలో శాసనసభావ్యవహారాలమంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు మాట్లాడుతూ ప్రతిపక్షం అనవసర రాద్దాంతం చేస్తూ రోజు సభను అడ్డుకోవడం శోచనీయమన్నారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ సమాధానం కంటే సభను అడ్డుకోవడమే ప్రధాన ఎజెండాగా పనిచేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏ సమస్యనైనా ప్రభుత్వ ధృష్టికి తమకు అవకాశం వచ్చినప్పుడు లేవనెత్తాలని సూచించారు. అయినా సభ్యులు వినక పోవడంతో స్పీకర్‌ సభను పదిగంటలవరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం వైఎస్సార్‌సిపి ఎమ్మెల్యేలు కాపు రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు విూడియా పాయింట్‌లో మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలో ఉండడానికి ఏమాత్రం అవకాశం లేదన్నారు. గత 20నెలలుగా వస్త్రవ్యాపారులు ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాచేస్తున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. ఆందోళనను ఉధృతం చేస్తూవ్యాట్‌ రద్దుచేసేవరకు పోరాటం తప్పదని చెప్పినా కూడా కాంగ్రెస్‌ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా కాలేదన్నారు. ఓవైపువ్యాట్‌ను ఇష్టమున్న రీతిలోవిధిస్తున్న ప్రభుత్వం మరోవైపు వ్యాట్‌ వసూలుకోసం అనేక రీతుల్లో ఒత్తిడులు చేస్తూ వేధిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం తప్పకుండా వ్యాట్‌ను రద్దుచేయాలని డిమాండ్‌ చేశారు. వాయిదా అనంతరం పదిగంటలకు సభ ప్రారంభమైనప్పటికి టిఆర్‌ఎస్‌ సభ్యులు అదేపనిగా తెలంగాణ తీర్మాణం చేయాలని పట్టుబట్టారు. దీనికి ఏమాత్రం స్పందన కనిపించలేదు. రాష్ట్రమంత్రి ధర్మాన ప్రసాదరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతి, రాబోయే కాలంలో చేపట్టాల్సిన పనుల గూర్చి చెప్పడమేకాక, నిధులను ఏవిధంగా ఖర్చుచేసుకోవాలనే అంశానికి సంబందించిన అంశమైనందున బడ్జెట్‌ ప్రతిపాదనలకు సహకరించాలని కోరారు. అయితే విపక్షాలు ఎంతకూ వెనక్కి తగ్గక పోవడంతో ఆయన సబ్‌ రూల్‌2 240 ప్రకారం సభ్యులను సస్పెండ్‌ చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ అందుకు సంబందించిన వారి పేర్లను చదివి వినిపించారు. వార్షిక బడ్జెట్‌ను ఆర్థికశాఖ మంత్రి ప్రవేశపెట్టేందుకు వీలుగా చర్య తీసుకోవాలని కోరారు. టిఆర్‌ఎస్‌కు చెందిన ఎమ్మెల్యేలను ఒకరోజు సస్పెన్షన్‌ చేస్తూ తీర్మాణం ప్రవేశపెట్టారు మంత్రి ధర్నాన ప్రసాదరావు. మంత్రి ప్రవేశపెట్టిన తీర్మాణంపై ఓటింగ్‌కు ఆహ్వానించి తీర్మాణాన్ని ప్రతిఒక్కరు ఆమోదించినట్లుగానే భావిస్తూ సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే సభ ఎంతకూ కంట్రోల్‌లోకి రాక పోవడంతో స్పీకర్‌ సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. సస్పెండ్‌ అయిన సభ్యులు సభను వదిలి వెళ్లాలని స్పీకర్‌ ఆదేశించారు. అయితే అందుకు ససేమిరా అన్న టిఆర్‌ఎస్‌ సభ్యులు అక్కడే కూర్చుని అక్రమంగా సస్పెండ్‌ చేశారంటూ నినాదాలిచ్చారు.