అసెంబ్లీ ఫలితాలతో మారిన తెలంగాణ సీన్
మరోమారు అడియాశలు కానున్న కాంగ్రెస్ ఆశలు
16 ఎంపి సీట్లు గెలుపే లక్ష్యంగా కెసిఆర్ కసరత్తు
హైదరాబాద్,జనవరి7(జనంసాక్షి): మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విపక్షాలకు అవకాశం లేకుండా అభివృద్ది, సంక్షేమ పథకాలతో కెసిఆర్ గట్టి దెబ్బనే కొట్టారు. దీంతో అన్ని పార్టీలు కలసినా ఇప్పుడు కెసిఆర్‌ను ఢీకొనడం సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా ఉన్నారని రుజువయ్యింది. తెలంగాణలో అమలవుతున్న పథకాలతో దేశవ్యాప్తంగా ప్రచారం సాగుతోంది. దీంతో వచ్చే పార్లమెంట్ ఎన్‌ఇనకల్లోనూ కాంగ్రెస్ తదితర పార్టీలు కలసినా లాభం ఉండకపోవచ్చు. ఇదొక్కటే చాలు కెసిఆర్ రేపటి ఎన్నికలపై ధీమాగా ఉన్నారనడానికి. రైతుబంధు పథకాన్ని అమలు చేయడం ద్వారా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి మార్గనిర్దేశనం చేశారు. ఆయన దూరాభారం ఆలోచించి ఈ పథకం అమలు చేస్తున్నారని ఎవరిని అడిగినా చెబుతారు. కేవలం ఎన్నికల్లో ఓటుబ్యాంక్‌ను పదిలపర్చుకునే దిశగా ఈ పథకం బాగా ఉపయోగ పడనుందని కూడా రుజువయ్యింది. ఈ ఒక్క పథకంతో ఇప్పుడు తెలంగాణలో కెసిఆర్‌కు ఉన్న వ్యతిరేకత కూడా మటుమాయం అయ్యింది. ఎందుకంటే రైతులంతా ఇప్పుడు కెసిఆర్‌కు జై అంటున్నారు. దీనికితోడు బీమా పథకం కూడా బాగా ఉపయోగపడింది.ఎపిలో ముఖ్యమంత్రి చంద్రబాబు బలహీన పడుతున్నారని ప్రచారం సాగుతున్న వేళ తెలంగాణలో కెసిఆర్ మరింతగా బలోపేతం కావడం రాజకీయంగా కలసివచ్చే అంశంగా చూడాలి. అయితే ఏపీలో చంద్రబాబుకు తిరుగులేదనీ, ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్‌రెడ్డిపై ప్రజలలో నమ్మకం రావడం లేదనీ లోపాయకారిగా బాబు ప్రచారం చేసుకుంటున్నా అంత సీన్ లేదని ఎపి ప్రజలే బాహాటంగా అంటున్నారు. తెలంగాణ ఏర్పడ్డ తరవాత బొటాబొటి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి కెసిఆర్ ముందుగా తన స్థానాన్ని పదిల పర్చుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అందులో భాగంగా ప్రతిపక్షాలను చీల్చి తాను బలపడటమే కాకుండా ప్రతిపక్షాలను బలహీనపరిచారు. ఇదంతా తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమన్నారు. ఇది పార్టీల కలయికో లేదా విలీనంగానో చూడరాద న్నారు. ఇదంతా తెలంగాణ అభివృద్దిలో భాగమని విశ్లేషించారు. ఆ తర్వాత వివిధ పథకాలకు రూపకల్పన చేయడం ద్వారా ప్రజాభిమానం చూరగొనే ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగానే రైతుబంధు పథకం ప్రకటించడంతో పాటు విజయవంతంగా పూర్తి చేశారు. దీంతో రైతులతో పాటు ప్రజల్లో కూడా భరోసా పెరిగింది. అవే మొన్నటి ఎన్నికల్లో టిఆర్‌ఎస్ మరింత బలోపేతం కావడానికి కారణమయ్యాయి. అయితే డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు వంటి పథకాలు అందరికీ అందకపోవడం వల్ల ప్రజలలో అసంతృప్తి ఉందన్న అంచనాలో విపక్ష పార్టీలో బోల్తాపడ్డాయి. అనేక విమర్శలతో పాటు తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2లక్షల రుణమాఫీ అని ప్రకటించినా ప్రజలు ముఖ్యంగా రైతులు నమ్మలేదు. ఈ ప్రభావం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లోనూ చూపనుంది. అసెంబ్లీలో లాగా కాకుండా లోక్‌సభలో వ్యతిరేకత ఉన్న స్థానాల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థులను నిలుపుతారన్న ప్రచారం కూడా ఉంది. గెలుపుగుర్రాలను ఎంపిక చేసే పనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల ప్రజలలో అనుకూలత ఉన్న నేతలను నిలుపుతారన్న ప్రచారం కూడా ఉంది. ఇవన్నీ బేరీజు వేసుకుని కొత్తటీమ్‌తో కెసిఆర్ ఎన్నికలకు వెళ్లేలా కసరత్తు చేస్తారన్న ప్రచారం పార్టీ కేబర్‌లో ఉంది. 17 ఎంపి స్థానాల్లో 16 గెలుపు లక్ష్యంగా కెసిఆర్ వ్యూహాలు ఉంటాయ నడంలో సందేహం లేదు. కాంగ్రెస్ వ్యవహారాలు కూడా కెసిఆర్‌కు కలసి రానున్నాయి. కుమ్ములాటలతో కాంగ్రెస్ మరింత కుంగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.