అసోంలో భాజపాకు భంగపాటు తప్పదు

4

– ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ

బార్పెటా,డిసెంబర్‌13,(జనంసాక్షి):అసోంలో కూడా బీజేపీకి ఓటమి తప్పదని కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అన్నారు. మైనారిటీల మద్దతుతో తాము అసోంలో కూడా విజయభావుటా ఎగురవేస్తామని, బీజేపీని మరోసారి ఓడిస్తామని అన్నారు.వచ్చే ఏడాది జరిగే అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఐక్యం కావాలని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఆ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని శనివారం లాంఛనంగా ప్రారంభించి, ప్రధాని నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. బార్పెటా జిల్లాలోని ఓ ఆలయం నుంచి ఏడు కిలోవిూటర్ల పాదయాత్ర ప్రారంభించిన ఆయన ఓ మసీదువద్ద ముగించారు. అనంతరం విూడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ లోక్‌ సభ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హావిూల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదని అందుకే అసోం ప్రజలు ఆయనను తిరస్కరించడం ఖాయమని అన్నారు. బిహార్‌ ప్రజలు మోదీని తిరస్కరించి ఢిల్లీకి వెళ్లిపోండి అని చెప్పారని, అసోంలో కూడా అదే జరుగుతుందని చెప్పారు. బార్పెటా జిల్లాలో 70శాతం మంది ముస్లిం జనాభా ఉంది. ఎన్నికల్లో గెలవడం కోసం ఆయన ఏదైనా చేస్తారన్నారు. ఆచరణ సాధ్యం కాని హావిూలు ఇవ్వడం, ప్రజల్లో ఘర్షణలు పెంచి విభజించడం మోదీకి అలవాటన్నారు. ఇటీవలి బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లోనూ  ఇవే జిమ్మిక్కులు ప్రదర్శించారని.. అయితే ప్రజలు వాటిని తిప్పికొట్టారని అన్నారు. కాగా, నేషనల్‌ హెరాల్డ్‌ కేసు  వల్లే జీఎస్‌టీ బిల్లును అడ్డుకుంటున్నారా అన్న ప్రశ్నకు రాహుల్‌ను మరోచోట విలేకర్లు ప్రశ్నించగా అవి రెండూ వేరువేరు అంశాలని అన్నారు.  జీఎస్‌టీ విషయంలో తమ డిమాండ్లను పరిష్కరిస్తే బిల్లును సమర్థించడానికి అభ్యంతరం లేదన్నారు. కాగా, నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో రాహుల్‌ వాస్తవాలను బయటపెట్టాలని బీజేపీ నేత శ్రీకాంత్‌ శర్మ ఢిల్లీలో డిమాండ్‌ చేశారు.

హెరాల్డ్‌ కేసుతో జీఎస్టీని ముడిపెట్టొద్దు

నేషనల్‌ హెరాల్డ్‌ వివాదానికి, జీఎస్టీ బిల్లుకు ముడిపెట్టొద్దని అన్ని రాజకీయ పార్టీల నేతలకు కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ స్పష్టం చేశారు. పన్నుల విధానంలో సంస్కరణలు చేపట్టేందకు రూపొందిస్తున్న జీఎస్టీ బిల్లులో తాము లేవనెత్తిన మూడు అంశాలను పరిష్కరిస్తే ఆమోదానికి సహకరిస్తామన్నారు. ఇదే అంశంపై ఆయన గౌహతిలో మాట్లాడుతూ జీఎస్టీకి హెరాల్డ్‌ వివాదానికి ముడిపెడుతూ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. కానీ వాటి మధ్య ఎటువంటి సంబంధంలేదు అని తేల్చి చెప్పారు. నేషనల్‌ హెరాల్డ్‌ , జీఎస్టీ బిల్లు అంశాలు వేర్వేరు అని స్పష్టం చేశారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందేందుకు ప్రధాని నరేంద్ర మోదీ  శుష్క వాగ్దానాలు చేసి ప్రజల్లో విభేదాలు

సృష్టించారని ఆరోపించారు. వచ్చే ఏడాది జరిగే అసోం ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రజలంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.