ఆంగ్లం నేర్చుకోండి.. తెలుగుపై పట్టుసాధించండి : సీఎం కిరణ్‌

శ్రీఇక తెలుగులో న్యాయపాలన
శ్రీతెలుగులో సాక్ష్యాలు నమోదు , తీర్పులు : జస్టిస్‌ ఎన్‌.వి.రమణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10(జనంసాక్షి):
విద్యార్థులు ఆంగ్లం నేర్చుకోవడంతో పాటు తెలుగులో పట్టు సాధించాలని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి సూచించారు. ఆదివారం జూబ్లీహాలులో తెలుగు న్యాయపాలన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు తెలుగు, ఇంగ్లిష్‌ భాషలకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పిల్లలకు చిన్నతనం నుంచే మాతృభాషలోనే విద్యనందించాలని ఉపాధ్యాయులను కోరారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు తప్పనిసరిగా తెలుగును అభ్యసించాలని కోరారు. ప్రతి చోటా తెలుగు వినపడేలా..కనపడేలా.. మాట్లాడేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. తెలుగులో న్యాయపాలన అందించేందుకు జ్యూడిషియల్‌ ముందుకు రావడం హర్షనీయమన్నారు. తెలుగు అమలు విషయంలో జ్యూడిషియల్‌తో పాటు ప్రభుత్వం కూడా అన్ని విభాగాల్లోను అనుసరిస్తుందన్నారు. అయితే ప్రభుత్వ శాఖల్లో కొంత సమయం పడుతుందన్నారు. చట్టం పట్ల ప్రజలకు అపార గౌరవం ఉందన్నారు. కోర్టు తీర్పులను అందరు ఆమోదించాల్సిందే.. శిరసావహించాల్సిందేనని అన్నారు. తెలుగు అమలు విషయంలో జ్యూడిషియల్‌కు ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని అన్నారు. ఏది కావాలన్నా సమకూర్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఏడాది పొడుగునా తెలుగు భాష అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.
తెలుగులో న్యాయపాలన వల్ల మేలెంతో..
తెలుగులో న్యాయపాలన జరిగితే ప్రజలకు మరింత మేలు జరుగుతుందని అధికార భాష సంఘం అధ్యక్షుడు మండలి బుద్దప్రసాద్‌ అన్నారు. అధికార భాష సంఘం, న్యాయ విద్యా కేంద్రం సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌, జస్టిస్‌ ఎస్వీ రమణ, మంత్రులు ఏరాసు ప్రతాప్‌రెడ్డి, వట్టి వసంతకుమార్‌ తదితరులు పాల్గొన్నారు. తొలుత మండలి బుద్దప్రసాద్‌ మాట్లాడుతూ తెలుగు భాష అమలుకు హైకోర్టు ముందుకు రావడం శుభపరిణామమన్నారు. సెషన్స్‌, మేజిస్ట్రేట్‌ కోర్టుల్లో తెలుగులోనే న్యాయపాలన జరగాలన్నారు. ఆయా కోర్టులకు వచ్చేవారందరూ తెలుగు భాష తెలిసిన వారేనన్నారు. కొంతమంది రాయలేరన్నారు. వారి సౌలభ్యం కోసం తెలుగులోనే న్యాయపాలన కొనసాగాలన్నారు. తెలుగులో న్యాయపాలన జరిగితేనే కోర్టులపై ప్రజలకు మరింత విశ్వాసం పెరుగుతుందని అన్నారు.ఇప్పటికే కొందరు న్యాయమూర్తులు తెలుగులోనే తీర్పులు ఇస్తూ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారని, వారికి అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.
తీర్పులు తెలుగులోనే జరగాలి : రమణ
న్యాయమూర్తులకు సమాజంతో సంబంధాలు ఉండవనేది అపోహ మాత్రమేనని జస్టిస్‌ ఎన్‌వి రమణ అన్నారు. సామాజిక సమస్యలను చైతన్యపూరితంగా గమనిస్తూ న్యాయవ్యవస్థ తగు విధంగా స్పందిస్తోందని అన్నారు. ప్రాంతీయ భాషల్లోనే న్యాయపాలన కొనసాగాలన్నారు. తద్వారా ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుం దన్నారు. స్వయం ప్రతిపత్తి గల న్యాయవ్యవస్థపై ప్రజలకు అపారమైన గౌరవం ఉందన్నారు. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి అభినందనలు తెలిపారు. ప్రజలకు న్యాయం జరగాలంటే సాక్ష్యాల నమోదు, తీర్పులు తెలుగులోనే జరిగితే ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని అన్నారు. కాగా ఈ సదస్సులో ప్రముఖ న్యాయమూర్తి మంగారి రాజేందర్‌ (జింబో) రాసిన’ తెలుగులో న్యాయపాలన’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు.