ఆంగ్ల సంవత్సరాదిని బలవంతంగా రుద్దడమెందుకు?

దేవాలయాల్లో ప్రత్యేక పూజలు జరపాలని ఉందా?
హిందూ సంస్థల మండిపాటు
విశాఖపట్టణం,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): ఆంగ్ల సంవత్సరాది దేవాలయాల్లో జరుపకపోతే మత సామరస్యానికి విఘాతం కలుగుతుందని కొందరు మేధావులు వితండ, విడ్డూర వాదన చేస్తున్నారని హిందూ వాదులు మండిపడ్డారు.హిందూ దేవాలయాల్లో హిందూ ధర్మం, పంచాగం ప్రకారం పూజలు, క్రతువులు, వేడుకలు జరగాలి గానీ గ్రెగేరియన్‌ క్యాలండర్‌ను బట్టి కాదన్నారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ‘ఉగాది’ రోజున నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ఆ రోజునే నూతన సంవత్సర పూజలు, వేడుకలు జరుపుకోవాలి. ప్రపంచీకరణ, పాశ్చాత్య సంస్కృతి ప్రభావం వలన చాలా మంది
జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు చేసుకుంటున్నారు. అంత మాత్రాన దేవాలయాల్లో కూడా అదే రోజు వేడుకలు చేయాలనటం అసంబద్ధం. జనవరి 1న హిందువులందరూ దేవాలయాలు సందర్శించ వచ్చని, కానీ దానిని ప్రామాణికంగా తీసుకోరాదని అన్నారు. ప్రతిరోజూ జరిగే పూజలు చేయవచ్చును. వాటిపై ఎటువంటి నిషేధం, నిబంధన లేదు.   ఇదే విధంగా ఆంగ్ల సంవత్సరాది ప్రత్యేక ప్రార్థనలు
మహమ్మదీయుల ప్రార్థనా మందిరాలలో చేయాలని వారు డిమాండ్‌ చేయగలరా? అంత ధైర్యం వారికి
కలదా? దేవాలయాల నిర్వహణ హిందూ సంప్రదాయాలు, శాస్త్రాల ప్రకారమే జరగాలి. కొంతమంది వ్యక్తిగత అభిరుచులు, అలవాట్లు, ఆలోచనల ప్రకారం జరగకూడదన్నారు.