ఆందోళన చేపట్టిన డిఇడి విద్యార్థులు

సంగారెడ్డి, జనవరి 31 (): జిల్లాలోని ఎస్‌జిటి పోస్టుల్లో డిఇడి అభ్యర్థులకే కేటాయించాలని  డిమాండ్‌ చేస్తూ మెదక్‌ జిల్లా కార్యాలయం ఎదుట డిఇడి విద్యార్థులు ధర్నా చేశారు. కాగా, ఎస్‌జిటి పోస్టులను ఇక్కడి బిఇడి అభ్యర్థులకు అనుమతిస్తూ రాష్ట్ర మంత్రి పార్థసారథి ఇచ్చిన ప్రకటనను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా బిఇడి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. మెదక్‌ డివిజన్‌ కేంద్రంలో డిఇడి విద్యార్థులు ర్యాలీగా వెళ్ళి సబ్‌ కలెక్టర్‌ భారతికి గురువారంనాడు ఒక మెమొరాండం సమర్పించారు. సిద్ధిపేట డివిజన్‌ కేంద్రంలోని డిఇడి విద్యార్థులు రాస్తారోకో ధర్నా చేపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 70,30 శాతం వంతున డిఎస్సీ నిర్వహించాలని విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు గతంలో ఎస్‌జిటి పోస్టులను డిఇడి అభ్యర్థులకు కేటాయించిన దృష్ట్యా జిల్లాలో చాలా మంది విద్యార్థులు, డిగ్రీ, పిజీ చేసినవారు డిఇడిలో శిక్షణ పొందుతున్నారు. ఉన్నత విద్యార్హతలున్నా తమకు ఉపాధి తప్పక లభిస్తుందన్న ఆశతో పిజీ విద్యార్థులు కూడా టీచర్‌ ట్రైనింగ్‌ ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నట్లు తెలిపారు.      ప్రభుత్వం పరంగా మెదక్‌ కాలేజీలో వందసీట్లు ఉండగా లక్షల రూపాయలు వెచ్చించి విద్యార్థులు ప్రైవేటు కళాశాలలో విధ్యనభ్యసిస్తున్నామని అన్నారు. డిఇడి విద్యార్థులు రెండు సంవత్సరాలు శిక్షణ పొందగా బిఇడి విద్యార్థులు 9నెలలు మాత్రమే శిక్షణ పొందుతున్నారని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల పట్ల విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాకలెక్టర్‌ దినకర్‌బాబుకు ఈ మేరకు సంగారెడ్డిలోని ప్రైవేటు డిఇడి అభ్యర్థులు ఒక వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఏమీ చేయలేమని, డిఇఓకు వినతిపత్రాన్ని పంపుతామని కలెక్టర్‌ వారికి తెలిపారు. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 70, 30శాతం మేర అమలు చేయకపోతే ఆందోళన మరింత తీవ్రం చేస్తామని హెచ్చరించారు.