ఆంధ్రకు మరో పెద్ద ఓడరేవు!
హైదరాబాద్, జూలై 26 (జనంసాక్ష): ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ ఓడరేవు నిర్మితం కావచ్చని తెలుస్తోంది. రాష్ట్రంలో 996 కి.మీ మేర సముద్రతీరం ఉంది. విశాఖ ఒక్కటే పెద్ద ఓడరేవు. రాష్ట్రంలోని జలమార్గాల ద్వారా విదేశీ వాణిజ్యం అధికంగా జరిగేందుకు అవకాశాలుండటంతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే దశాబ్దంలో మరో పెద్ద ఓడరేవు నిర్మాణానికి కేంద్రప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇందుకోసం విశాఖ జిల్లా నక్కపల్లి, ప్రకాశం జిల్లా రామాయపట్నం, నెల్లూరు జిల్లా దుగ్గిరాజపట్నం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత ఆరు నెలల్లో అత్యున్నత స్థాయి కేంద్రకమిటీ ఈ మూడు ప్రాంతాలను సందర్శించింది. మరో కొద్ది నెలల్లో చివరి నిర్ణయం వెలువడవచ్చు. రామాయపట్నానికి ప్రాధాన్యం ఉండవచ్చని తెలుస్తోంది. విశాఖ జిల్లాలో ఇప్పటికే ఒక పెద్ద ఓడరేవు ఉంది. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం రేవును అభివృద్ధి చేస్తున్నారు. పైగా నెల్లూరు జిల్లాలో భారత్ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఉంది. అందువల్ల ఇక్కడ రేవు నిర్మాణానికి ఇస్రో అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇక రామాయపట్నానికే ప్రాధాన్యం లభించవచ్చని తెలుస్తోంది. కాగా ప్రకాశం జిల్లాలో వాన్‌పిక్ కారిడార్ పేరిట పలు అవకతవకలు చోటు చేసుకోవటంతో రైతులకు చాలా నష్టం జరిగింది. వారికి ఇప్పుడు లబ్ధి కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మినీరేవులకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా కళింగపట్నం, భావనపాడులపై దృష్టి సారిస్తున్నారు.