ఆంధ్రాలో దారుణం

4
– చిత్తూరు మేయర్‌ అనురాధ, ఆమె భర్త దారుణ హత్య

చిత్తూరు, నవంబర్‌ 17 (జనంసాక్షి):

చిత్తూరు నగర మేయర్‌ కఠారి అనురాధ దారుణహత్యకు గురయ్యారు. బురఖా ధరించి వచ్చిన దుండగులు అతి సవిూపంలో నుంచి కాల్చి ఆమెను దారుణంగా హత్య చేశారు.  మంగళవారం ఉదయం చిత్తూరు నగర పాలకసంస్థ కార్యాలయంలోనే మేయర్‌, ఆమె భర్త మోహన్‌పై దండుగులు దాడి చేశారు. మేయర్‌, అమె భర్తను కర్ణాటకకు చెందిన ముగ్గురు దుండగులు పాయింట్‌ బ్లాంక్‌లో కాల్చి, కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో మేయర్‌ అనురాధ మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన మోహన్‌ను తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తరలించారు. చిత్తూరు నగరపాలక కార్యాలయంలో మంగళవారం హత్యాయత్నానికి గురైన చిత్తూరు నగర మేయర్‌ భర్త కటారి మోహన్‌ చికిత్సపొందుతూ మృతిచెందారు. మేయర్‌ దంపతులపై దుండగులు కత్తులు, తుపాకీతో దాడిచేసిన ఘటనలో మేయర్‌ అనురాధ అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన మోహన్‌ను చికిత్సనిమిత్తం తమిళనాడులోని వేలూరు సీఎంసీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో మంగళవారం రాత్రి మోహన్‌ మృతి చెందారు. దాడికి ఎవరు పాల్పడిందన్న కోణంఓల పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే గాలంపి చర్యలు ముమ్మరం చేశారు. ఇదిలావుంటే ఇద్దరు వ్యక్తులు లొంగిపోయారని చెబుతున్నారు. అయితే దీనిని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది.మంగళవారం ఉదయం చిత్తూరు నగరపాలక సంస్థ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో ఉన్న మేయర్‌ అనూరాధ, ఆమె భర్త మోహన్‌ను అభినందించడానికి వచ్‌ంచామంటూ ఆరుగురు బొకేలతో వచ్చారు. వీరు కాల్పులు జరిపి, కత్తులతో దాడి చేశారు. రక్తపు మడుగులో పడి ఉన్న దంపతులను చిత్తూరు 2టౌన్‌ పోలీసులు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మార్గ మధ్యంలో మేయర్‌ అనురాధ మృతి చెందినట్లు సమాచారం. పరిస్థితి విషమంగా ఉండటంతో మోహన్‌ను తమిళనాడులోని వేలూరు సీఎంసీకి తరలించారు. మేయర్‌ హత్య ఘటనతో చిత్తూరులో ఉద్రిక్తత నెలకొంది. దావనలంలా వార్త వ్యాపించడంతో చిత్తూరు ఒక్కసారిగా ఉలిక్కిపడింది. పాత కక్షల నేపథ్యంలోనే ఘటన జరిందన్న కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ముసుగులు ధరించి నగర పాలక సంస్థ కార్యాలయంలోకి దౌర్జన్యంగా చొరబడిన ముగ్గురు దుండగులు పాయింట్‌ బ్లాంక్‌లో మేయర్‌, ఆమె భర్తపై కాల్పులు జరిపినట్లు స్థానికులు చెబుతున్నారు.పాయింట్‌ బ్లాంక్‌ రేంజిలో నేరుగా నుదుటిపై కాల్పులు జరపడంతో.. ఆమె సంఘటన స్థలంలోనే మృతిచెందారు. అనూరాధతో పాటు ఉన్న ఆమె భర్త కఠారి మోహన్‌పై దుండగులు కత్తులతో దాడి చేశారు. ఆయన తీవ్రంగా గాయపడ్డారు. మోహన్‌ను వెంటనే చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆయన పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి ఆయనను రాయవెల్లూరులోని సీఎంసీకి తరలించారు. దాడి అనంతరం దుండగులు గేట్లు దూకి పారిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. 8 మంది కార్పొరేటర్లు, ఇతర నాయకులు చూస్తుండగానే ఈ దాడి జరిగింది. దుండగులంతా 25-35 ఏళ్ల మధ్య వయసువాళ్లేనని ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తర్వాత అందరూ ద్విచక్ర వాహనాలపై పారిపోయారని, అలా వెళ్లేటప్పుడు మూడు బురఖాలు, ఒక రివాల్వర్‌ కింద పడిపోయాయని, వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు. చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబుపై గతంలో జరిగిన హత్యాయత్నం కేసులో కఠారి మోహన్‌ ప్రధాన నిందితుడు. గతంలో ఆయన కర్ణాటకలో కొన్నాళ్లు తలదాచుకున్నారు. ఆ తర్వాత తిరిగి వచ్చి, తన భార్యను మేయర్‌గా చేసుకున్నారు. దీన్ని తెలుగుదేశం పార్టీలోని ఒక గ్రూపు వ్యతిరేకించింది. అయితే తాను చాలాకాలం పార్టీ కోసం కష్టపడ్డానని, భద్రతా కారణాల రీత్యా కూడా ఆ పదవి కావాలని పట్టుబట్టి మరీ భార్యను మేయర్‌ చేసుకున్నారు. ఆ తర్వాతి నుంచి పార్టీలోని ఒక గ్రూపు మాత్రం మోహన్‌కు దూరంగా ఉంటూ వస్తోంది. మేయర్‌ కుటుంబ సభ్యులు ఎవరూ ఈ వ్యవహారంపై మాట్లాడేందుకు ఇష్టపడట్లేదు. కుటుంబ కలహాలు కూడా కారణం అయి ఉండొచ్చని పోలీసులు విశ్వసిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే జయచంద్రారెడ్డి వర్గానికి, మేయర్‌ బర్త వర్గానికి మధ్య విబేధాలు ఉన్నాయి. ఆ కారణంగా ఈ దాడి జరిగిందా?లేక వేరే కారణాలు ఉన్నాయా అన్నదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఈ ఘటనతో టిడిపి వర్గాలు  కలవరానికి గురయ్యాయి. సంఘటన తెలుసుకున్న సిఎం చంద్రబాబు తీవ్రగ్భ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వెంటనే మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి హుటాహుటిని చిత్తూరు బయలుదేరి వెళ్లారు..