ఆంధ్రా ట్రావెల్స్‌కు చుక్కెదురు

2

-ఎంట్రీ టాక్స్‌ పిటీషన్‌ కొట్టేసిన సుప్రీం కోర్టు

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి):

ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. తెలంగాణ ప్రభుత్వం పన్ను విధించడం సరికాదంటూ ఏపీ ప్రైవేటు ట్రావెల్స్‌ యజమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇప్పటికే హైకోర్టు ముందు ఉన్న నేపథ్యంలో త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు హైకోర్టును ఆశ్రయించింది. తెలంగాణ ప్రభుత్వం రవాణాపన్ను వేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ముందు హైకోర్టుకు వెళ్లిన ఆంధ్రా ట్రావెల్స్‌కు అనుకూలంగా తీర్పు రాకపోవడంతో సుప్రీంకోర్టుకు వెళ్లిన సంగతి తెలిసిందే. త్వరగా కేసు విచారణ పూర్తి చేయాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం విధించిన ఎంట్రీట్యాక్స్‌ను వ్యతిరేకిస్తూ ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమానులు వేసిన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ అంశం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నందున అక్కడే తేల్చుకోవాలని పిటిషనర్లకు ఉన్నతన్యాయస్థానం సూచించింది. అలాగే పిటిషన్‌ను త్వరగా పరిష్కరించాలని ఉమ్మడి హైకోర్టును సుప్రీం ఆదేశించింది.ఎంట్రీ ట్యాక్స్‌పై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో టాక్స్‌ వసూలు అనంతరం నగదును ప్రత్యేక ఎకౌంట్‌లో జమచేయాలని ఆదేశించింది. ఆ నగదును ఇతర ఖర్చులకు వినియోగించరాదని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రత్యేక కోర్టులో జమ చేసే మొత్తాన్ని ఇతర అవసరాలకు ఉపయోగించుకోడానికి తమకు అనుమతివ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా, టి.సర్కార్‌ ఎంట్రీట్యాక్స్‌ విధించడాన్ని సవాల్‌ చేస్తూ ప్రైవేటు ట్రావెల్స్‌ యాజమాన్యం సుప్రీంలో పిటిషన్‌ దాఖలు చేశాయి.

ఇరువురి పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీనిపై హైకోర్టులో విచారణ జరుగుతున్నందున ఈ సమయంలో దీనిపై సుప్రీం కోర్టు జోక్యం చేసుకోవడం కుదరదని జస్టిస్‌ హెచ్‌ఎల్‌ దత్తు నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేసి తీర్పును ఇవ్వాలని హైకోర్టును ఉన్నతన్యాయస్థానం ఆదేశించింది. ఎక్కువగా పన్నులు వసూలు చేస్తున్నారంటూ ప్రైవేటు ట్రావెల్స్‌ ఆపరేటర్స్‌ తరపున వీవీఎస్‌రావు చేసిన వాదనను తిరస్కరించిన ధర్మాసనం పన్నులు విధించకపోతే ప్రభుత్వం ఎలా నడుస్తుందని వ్యాఖ్యానించింది.