ఆగస్టు 15 నుంచి ప్రతీ రైతుకు బీమా
– 10రోజుల్లోనే రైతుల ఇంటికి బీమా సొమ్ము
– దేశంలో ఎక్కడాలేని విధంగా తెలంగాణలో అద్భుత పథకాలు
– వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి
– జడ్చర్ల నియోజకవర్గంలో రైతులకు చెక్కులు అందించిన మంత్రి
మహబూబ్‌నగర్,మే30( జనం సాక్షి): ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని ప్రతీ రైతుకి బీమా వర్తింపు అవుతుందని.. ప్రమాదవశాత్తు రైతు మరణిస్తే.. ఆ రైతు ఇంటికి 10 రోజుల్లోనే బీమా సొమ్ము వస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్ల నియోజకవర్గంలోని హామాజీపూర్, కొల్లూరు, పోమాల్ గ్రామాల్లో మంత్రి లక్ష్మారెడ్డి రైతులకు చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి రైతుకి బీమా ప్రీమియం రూ. 2,500లను ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. బీమా పథకం కోసం రూ. వెయ్యి కోట్లను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. రైతాంగ, దేశ చరిత్రలోనే పంట పెట్టుబడి పథకం గొప్పది అని పేర్కొన్నారు. ఇప్పుడు రైతులకు బీమా చెల్లించే పథకం అంతకంటే గొప్పది అని మంత్రి చెప్పారు. రాష్ట్రంలో రైతులను అన్ని విధాలుగా ఆదుకొనేందుకు కేసీఆర్ ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగుతున్నారన్నారు. ఇప్పటికే పెట్టుబడి చెక్కులు అందించిన ప్రభుత్వం రైతుబీమాను కూడా అమలు చేస్తుందన్నారు. పంద్రాగస్టు నుంచి రైతులకు రూ.5 లక్షల బీమా పథకాన్ని అమలు చేయనున్నామని మంత్రి అన్నారు. రైతులు మరణిస్తే వారి కుటుంబాలకు ప్రభుత్వం పది రోజుల్లో ఇన్సూరెన్స్ డబ్బులను అందించి అండగా నిలబడుతుందని, అందుకోసం రాష్ట్రంలోని ఇన్సూరెన్స్ కంపెనీలకు రూ.వెయ్యి కోట్లు చెల్లిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం కోసం ప్రతీ గ్రామంలో ఇంటింటికీ రెవెన్యూ అధికారులు తిరిగి రైతు పట్టాదారు పాసు పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్, నామినీ పేర్లు తదితర వివరాలు సేకరిస్తారన్నారు. అధికారుల పనితీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దని, విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షమ పథకాలు రూపొందించి అమలు చేస్తున్నారని అన్నారు. తాజాగా ప్రతి రైతుకూ రూ. 5 లక్షల బీమా సౌకర్యం కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఈ పథకాన్ని ఆగస్టు 15వ తేదీనుంచి అమలులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. 18 నుంచి 59 సంవత్సరాల మధ్య వయస్సున్న రైతులకు ఒక్క గుంట భూమి ఉన్నా బీమా పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 59 లక్షల మందికి లబ్ది చేకూరనుందన్నారు. వ్యవసాయానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని అన్నారు. చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టి పూర్వ వైభవం తేవడంతో పాటు భూములను సస్యశ్యామలం చేసేందుకు ప్రాజెక్టులు నిర్మించి రెండు పంటలకూ సాగునీరు అందిస్తున్నామని తెలిపారు. దీంతో బీళ్లుగా మారిన భూములన్నీ నేడు సాగులోకి వస్తున్నాయని అన్నారు. బంగారు తెలంగాణలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టి ప్రతి రైతుకూ రైతుబంధు పథకం ద్వారా డిజిటల్ పాస్ పుస్తకాలు, పంట పెట్టుబడి చెక్కులు అందించడమే అందుకు నిదర్శనమన్నారు. ఒక్కో రైతు పేరిట రూ. 2270 ప్రీమియం చెల్లిస్తున్నట్లు తెలిపా రు. దీనికితోడు ఖరీఫ్ పంటలకు గిట్టుబాటు ధర కలిగేలా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేయటం జరిగిందని, ఈ సమన్వయ సమితులు రైతులకు గిట్టుబాటు ధర కల్పించే బాధ్యత తీసుకుంటాయని తెలిపారు. తెలంగాణ రైతును దేశానికే ఆదర్శంగా నిలిపేలా కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తితో పాలమూరు పల్లెల్లో పచ్చదనం పరుచుకుంటుందని లక్ష్మారెడ్డి అన్నారు. కాంగ్రెస్ నేతలు ప్రాజెక్టులను అడ్డుకోవటం, ప్రభుత్వ పథకాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ పాలనతో కాంగ్రెస్‌ను ప్రజలు మరిచిపోతారని భయపడుతున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్‌ను రాష్ట్రం నుంచి తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెరాస నేతలు, అధికారులు పాల్గొన్నారు.