ఆగస్టు 2 నుంచి అమల్లోకి కొత్త పంచాయతీలు

502నుంచి 844కు పెరిగిన పంచాయతీల సంఖ్య

నల్లగొండ,జూలై28(జ‌నం సాక్షి): తండాలను పంచాయితీలుగా చేయడంతో వాటి సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం నల్లగొండ జిల్లాలో ఉన్న 502పంచాయతీల సంఖ్య మరో వారం రోజుల్లో 844కు చేరనుంది. వీటితోపాటే 5 మున్సిపాలిటీలు సైతం కొత్తగా ఉనికిలోకి రానున్నాయి. ఆగస్టు 2నుంచి ప్రస్తుత సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులను గ్రామాల్లో పరిపాలన అప్పగించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇప్పటికే కొత్త పంచాయతీల ఏర్పాటుకు ఉత్తర్వులు జారీ చేసిన విషయం విదితమే. ఉమ్మడి జిల్లా నుంచి 349పంచాయతీలు ఏర్పాటు కానుండగా నూరు శాతం ఎస్టీ జనాభా కలిగి తండాలు 104, మరో 245మారుమూల ఆవాసాలున్నాయి. పెరుగుతున్న వాటితో కలుపుకొని జిల్లాలో పంచాయతీల సంఖ్య 844కాగా ఈ సంఖ్య రాష్ట్రంలోనే అత్యధికం కావడం విశేషం. సూర్యాపేటలో ప్రస్తుతం 323 పంచాయతీలు ఉండగా ఆ సంఖ్య 475కు చేరనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో 334గా ఉన్న గత సంఖ్య 401కి పెరగనుంది. ఆగస్టు 1తో ప్రస్తుత సర్పంచ్‌ల పదవీ కాలం ముగుస్తుండడంతో ఆగస్టు 2నుంచి కొత్తగా ఏర్పడ్డ 349పంచాయతీల్లో పరిపాలన ప్రారంభం కానుంది. ఇందుకోసం 180మంది మండల స్ధాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా, ఐదు మున్సిపాలిటీల బాధ్యతలను జిల్లా స్థాయి అధికారులకు అప్పగించనున్నారు. ఇప్పటికే ఆయా పంచాయతీలకు సంబంధించి భవనాలు, అవసరమయ్యే సామగ్రి సిద్ధం చేశారు. పాత పంచాయతీలో ఉన్న సిబ్బందిని కొత్త పంచాయతీలకు అనుగుణంగా విభజిస్తున్నారు. జనాభా ప్రకారం ఆస్తుల పంపిణీ పక్రియ పూర్తి చేస్తారు. ప్రత్యేక అధికారులు కచ్చితంగా ఆగస్టు 2నే బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్తగా ఏర్పాటు కానున్న పంచాయతీలను పండుగ వాతావరణంలో ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేపడుతోంది. ఇంతకాలం స్వపరిపాలన కోసం ఎదురు చూసిన మారుమూల ఆవాసాలు, గిరిజన తండాలు కొత్త పరిపాలనా కేంద్రాలుగా మారనున్నాయి.