ఆగస్టు15 నాటికి అదనపు భవనాలు పూర్తి చేయండి
కలెక్టర్ వెంకట్రామిరెడ్డి
శ్రీకాకుళం, జూన్ 24 : పాఠశాల అదనపు భవనాల నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తన క్యాంపు కార్యాలయంలో పంచాయితీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థల వివాదాల వల్ల పనులు ప్రారంభం కానివాటిని రద్దు చేయాలని రాజీవ్ విద్యామిషన్ అధికారులకు ఆదేశించారు. చాలా పాఠశాలల్లో తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. జిల్లా విద్యాశాఖ నుంచి తరగతి గదుల కొరత ఉన్న పాఠశాలల వివరాలు తెప్పించుకొని వాటికి అదనపు గదులు మంజూరు చేయాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇంజినీరింగ్ అధికారులు బి.అప్పలనాయుడు, ఎ.ప్రభాకరరావు, ఎంఆర్‌పి నాయుడు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.