ఆజాద్‌ మాటలు తెలంగాణ

ఆత్మగౌరవంపై దాడి : దేవీప్రసాద్‌
హైదరాబాద్‌, జనవరి 24 (జనంసాక్షి):
తెలంగాణపై నెల రోజుల్లో నిర్ణయం తీసుకోలేమన్న రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యలపై తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ దేవీప్రసాద్‌ మండిపడ్డారు. ఆజాద్‌ మాటలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై దాడి చేసేలా ఉన్నాయన్నారు. గురువారం స్థానికంగా టీజేఏసీ అత్యవసర సమావేశం   నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 28లోగా తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాన్ని నిలబెట్టుకోకుండా కేంద్రమంత్రి ఆజాద్‌ అయోమయానికి గురిచేసే వ్యాఖ్యలను ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌ షిండే నిర్ణయంపై దీనితో సంబంధంలేని అఖిలపక్ష సమావేశానికి హాజరుకాని  మంత్రి ఆజాద్‌ వ్యాఖ్యలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హోంమంత్రి మాటలకు అర్థం లేకుండా చేశారని ఆరోపించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవంపై ఆజాద్‌ దాడి చేశారని, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించే విధంగా ప్రయత్నించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవీపీ నాయకత్వంలో సీమాంధ్ర మంత్రులు, చిన్న చిన్న లాబీయింగ్‌కే కేంద్రం తలొగ్గిందని తెలిపారు. సీమాంధ్రుల ప్రయత్నాలు కేంద్రమంత్రుల వ్యవహారం ప్రజాస్వామ్యానికే మచ్చ తెచ్చేవిధంగా ఉందని, ప్రజాస్వామ్యం మనుగడకే ప్రమాదకరమని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు తెలంగాణనుంచి స్పష్టమైన ప్రకటన తీసుకువచ్చేందుకు అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని ఆయన డిమాండ్‌ చేశారు. సమర దీక్షలో తెలంగాణ వ్యాప్తంగా మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న ఉద్యోగ సంఘాల నాయకులు సమర దీక్షలో పాల్గొంటారని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని చవిచూడక తప్పదని హెచ్చరించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటాన్ని ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని పోరాడుతామన్నారు.
వంద రోజుల సమ్మెకు సిద్ధం..
టీ జేఏసీ పిలుపు ఇస్తే సకల జనుల సమ్మెను మించి వంద రోజుల సమ్మెకైనా ఉద్యోగులందరూ సిద్ధంగా ఉన్నారని తెలంగాణ గజిటెడ్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్‌ గౌడ్‌ తెలిపారు. టీ జేఏసీ అత్యవసర సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం , కాంగ్రెస్‌ పార్టీ మరో సారి తెలంగాణ ప్రజలను వంచించిందని ఆరోపించారు. తెలంగాణ అంశంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు  తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నదని ఆయన ఆరోపించారు. ఇక తెలంగాణ ప్రజలు ఊరుకునే ప్రసక్తేలేదని, ప్రాణత్యాగాలు చేసైనా తెలంగాణ సాధించుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 27న టీ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించే సమర దీక్షకు ప్రజలంతా మద్దతు పలకాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ దఫా ఉద్యమంలో తెలంగాణ ప్రజాప్రతినిధులు, పార్టీలకు అతీతంగా పాల్గొని నాయకత్వం వహించాలని ఆయన డిమాండ్‌ చేశారు.