ఆటోలో నోట్ల కట్టల కలకలం
పోలీసుల అదుపులో నిందితులు
హైదరాబాద్, నవంబర్ 7 (జనంసాక్షి):
నగరం లో బుధవారం కోట్లాదిరూపాయల నోట్ల కట్టలు కలకలం సృష్టించాయి. నగరం నడిఒడ్డున ఉన్న డీజీపీ కార్యాలయం వద్ద ఆటోలో నోట్ల కట్టలు రవాణా అవుతుండగా పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు లకీడీకపూర్ వద్ద వాహానాలు తనిఖీ చేస్తున్నారు. ఆ సమయంలో ఓ ఆటోలో నాలుగు లగేజీ బ్యాగ్‌లు ఉండడాన్ని పోలీసులు గుర్తించారు. డీజీపీ కార్యాలయం వద్ద నగదు రవాణ చేస్తున్న ఆటో ఆగిపోవడంతో ఇద్దరు వ్యక్తులు ఆ బ్యాగ్‌లను మరో ఆటోలోకి మారుస్తున్నారు. ఆ సమయంలో ట్రాఫిక్ రద్దీగా ఉండడం, మరోవైపు తనిఖీలు నిర్వహిస్తుం డటంతో త్వరగా ఆటోలను పక్కకు తీయ్యాలని చేప్పేందుకు ఆటోల దగ్గరకు వచ్చారు. అయితే బరువుగా ఆ బ్యాగులను
మారుస్తుండడాన్ని పోలీసులు గమనించి వాటిలో ఏముందని ప్రశ్నించారు. బట్టలు ఉన్నాయని ఆటోలో ఉన్న ఇద్దరు వ్యక్తులు చెప్పారు. బట్టలు ఇంత బరువుగా ఉంటాయా? తెరిచి చూపాలని గద్దించగా ఆ ఇద్దరితో పాటు డ్రైవర్ కూడా ఆటోను వదిలి పరారయ్యారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సహచరులకు సమాచారం అందించారు. ఆ బ్యాగ్‌లను తెరిచి చూడగా కళ్ళు చెదిరేలా నోట్ల కట్టలు కనిపించాయి. దీంతో పోలీసులు ఆ బ్యాగ్‌లను ఆటోను సైదాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పారిపోయిన వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. దొరికిన కరెన్సీ అసలుదా లేక నకిలీయా అని పరిశీలిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కోట్లాది రూపాయల సొమ్మును ఎక్కడి నుంచి ఎక్కడికి ఎవరికి సరఫరా అవుతోందో అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ మొత్తం 3కోట్లని, 7కోట్లని, 10కోట్లని రకరకాలుగా చెబుతున్నారు. ఏది ఏమైనా మొత్తం మీద కోట్లలోనే నగదు రవాణా అవుతున్నది. ఇంత రహస్యంగా మార్చాల్సిన అవసరం ఏమిటీ అనే ప్రశ్న తలెత్తుతుంది. బెంగళూరు నుంచి వచ్చి ఉండవచ్చునని, లేదా ఇటీవల ఐటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఈ సోమ్మును వేరే ప్రాంతానికి తరలిస్తుండవచ్చునని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.