ఆడపిల్లల చదువుతోనే అభివృద్ధి
అన్నివిధాలుగా ప్రభుత్వం అండ: ఎర్రబెల్లి
జనగామ,అగస్టు4(జనం సాక్షి): ఆడపిల్లల చదువుతోనే సమాజంలో అభివృద్ధి సాధ్యమవుతుందని పంచాయతీరాజ్ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వారికి ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా ఉంటోందని అన్నారు. పాలకుర్తి మండల కేంద్రంలో గల వెలుగు స్కూల్ విద్యార్థినిలకు మంత్రి దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆడ వాళ్లు అన్ని రంగాల్లోనూ ముందున్నారని చెప్పారు. ఆడపిల్లల విద్యను ప్రోత్సహించాలన్నారు. పిల్లల చదువుల పట్ల తల్లి తండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకుంటారని, వారి ఆశలు, ఆశయాలకు తగ్గట్లుగా పిల్లలు చదువుకోవాలని ఆయన సూచించారు. పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థానాలకు చేరితేనే చదువుకు సార్ధకత లభిస్తుందన్నారు. తల్లిదండ్రులు గర్వపడేలా పిల్లలు ఎదగాలన్నారు. వారికి అందుతున్న సదుపాయాలు, చదువులపై అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.