ఆత్మబలిదానాలు వద్దు

పోరాడి ప్రత్యేకరాష్ట్రం సాధించుకుందాం
విద్యుత్‌ ఉద్యోగుల ధూంధాంలో కోదండరామ్‌
హైదరాబాద్‌, డిసెంబర్‌ 12 (జనంసాక్షి) :
ఆత్మహత్యలతో తెలంగాణ రాదని, పోరాడి సాధించుకుందామని జేఏసీ చైర్మన్‌ కోదండరాం అన్నారు. బుధవారం విద్యుత్‌ సౌధ ఎదుట చేపట్టిన విద్యుత్‌ ఉద్యోగుల ధూంధాంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం నాన్చివేత ధోరణి అవలంబించడం వల్ల ఏడువందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. తెలంగాణ తెచ్చేది మేమే.. ఇచ్చేది మేమే అంటూ ప్రగల్భాలు పలికిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు ప్రజలకు ఏమని సమాధానం చెబుతారన్నారు. సీమంధ్ర నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి డిసెంబర్‌ 9 ప్రకటనను వెనక్కి తీసుకోవడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ కోసం అమరులైన వారి కుటుంబాలను ఆదుకుం టామన్నారు. తెలంగాణపై అఖిలపక్ష సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఎందరు వెళ్లినా ఒకే అభిప్రాయం చెప్పాలన్నారు.
ఈ నెల 28న ఢిల్లీ అఖిలపక్ష సమావేశానికి వెళ్తున్న పార్టీలు ఒకే అభిప్రాయం చెప్పేలా ఆయా పార్టీల్లోని తెలంగాణ నేతలు బాధ్యత తీసుకోవాలని సూచించారు. తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించని పార్టీలకు గోరీ కడుతామని హెచ్చరించారు.