ఆత్మహత్యలు చేసుకోవద్దు – టీ జేఏసీ చైర్మన్ కోదండరామ్ భరోసా ఇచ్చేందకే యాత్ర – నాగం
మహబూబ్‌నగర్, నవంబర్ 26 (జనంసాక్షి) : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎంతో దూరంలో లేదని విద్యార్థులు, యువకులు ఆత్మహత్యలు చేసుకోవద్దని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేటలో సోమవారం తెలంగాణ నగార సమితి నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రారంభించిన భరోసా యాత్రలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీమాంధ్ర పాలకుల చేతిలో తెలంగాణ ప్రజానీకం ఎన్నో మోసాలకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై వారి మోసాలు చెల్లబోవని హెచ్చరించారు. మన నీళ్లు, మన ఉద్యోగాలు, మన నిధులు, మన వనరులు మనమే కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఓట్లు దండుకునేందుకే టీడీపీ, వైఎస్సార్ సీపీ నేతలు పాదయాత్రలు చేస్తున్నారని, ప్రజలు ఈ విషయం గుర్తించాలన్నారు. నాగం జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రాంతానికి కాంగ్రెస్, టీడీపీ పాలనలో ఎంతో అన్యాయం జరిగిందన్నారు. కేంద్రంలోని యూపీఏ పాలకులు, సీమాంధ్ర నాయకులు రెచ్చగొట్టేలా చేస్తున్న ప్రసంగాలతో విద్యార్థులు గుండె పగిలి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1969 ఉద్యమంలో పాల్గొన్న తాను విద్యార్థులు, యువతలో గుండె ధైర్యం పెంచి భరోసా ఇచ్చేందుకు యాత్ర చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ప్రాంతానికి చేసిన అన్యాయాన్ని ఎవరూ మర్చిపోలేన్నారు. బీజేపీ సీనియర్ నాయకుడు బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ, యూపీఏ తెలంగాణ ఇస్తామని ఎన్నికల్లో గెలిచి మోసం చేసిందన్నారు. కేంద్రంలో మధ్యంతర ఎన్నికలు ఖాయమని అన్నారు. 610 జీవో అమలు చేయాలని హైకోర్టు తీర్పునిచ్చినా సీఎం కిరణ్ అమలుకు సిద్ధంగా లేదన్నారు. 2014 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ ఇవ్వడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను బీజేపీ గౌరవిస్తుందని తెలిపారు. అంతకుముందు నాగం ఉమామహేశ్వరంలో పూజలు నిర్వహించి అచ్చంపేటకు చేరుకున్నారు.