ఆదర్శానికి చిహ్నంగా సిద్దిపేట-మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేట(జనం సాక్షి ): సిద్దిపేట అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ(సుడా), ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించి.. కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. ఆదర్శానికి చిహ్నంగా సిద్దిపేట ను మార్చుకుంటున్నాం. కార్పొరేషన్లకు మాత్రమే అథారిటీ ఉంటుంది. వాటి సరసన సిద్దిపేటను నిలిపిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు. తెలంగాణ నడి బొడ్డున ఉన్న సిద్దిపేట వేగంగా అభివృద్ధి చెందుతున్నది. సిద్దిపేట జిల్లాకు రెండు జాతీయ రహదారులు వస్తున్నాయని వివరించారు. సిద్దిపేట ప్రజలు నిరంతర సహకారం అందిస్తున్నారు. సిద్దిపేటలో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మొదటి దశ ఫలితం త్వరలో అందుబాటులోకి వస్తున్నది. పట్టణమంతా పచ్చదనంతో హరిత సిద్దిపేటగా మార్చడానికి సుడా కృషి చేయాలని హరీశ్ రావు అన్నారు. సిద్ధిపేటకు రాష్ట్ర, జాతీయస్థాయిలో అవార్డులు రావడంలో మంత్రి హరీశ్ రావు కృషి ఎంతో ఉందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. సుడా ద్వారా అభివృద్ధిలో సిద్దిపేట ముందడుగు వేస్తుంది. సుడా సిద్దిపేట ప్రజలకు గొప్ప కానుక అని ఎంపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.