ఆదిలాబాద్‌ పత్తి రైతుల కన్నెర్ర

5

– అధికారుల నిర్భందం

ఆదిలాబాద్‌,నవంబర్‌2(జనంసాక్షి):

పత్తిరైతుల దాడితో ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డు ఉద్రిక్తంగా మారింది. తమకు గిట్టుబాటు కాని ధరకు పత్తి కొనుగోలు చేస్తున్నారని ఆగ్రహించిన రైతన్నలు మార్కెట్‌ యార్డు కార్యాలయంపై దాడి చేసి అధికారులను నిర్బంధించారు. అక్కడ వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో కార్యాలయంలోని ఫర్నీచర్‌ ధ్వంసం అయింది. అదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఉన్న ధర కంటే తక్కువకు కొనగోలు చేస్తున్నట్టు అధికారులు చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు.ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదాలతో రైతులు అధికారులను నిర్బంధించి కార్యలయంలోని ఫర్నీచర్‌, అద్దాలు ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆదిలాబాద్‌ మార్కెట్‌ యార్డులో సోమవారం పత్తి ధర పడిపోవడంతో రైతులు తీవ్ర ఆగ్రహానికి గురై ఆందోళనకు దిగారు. క్వింటాలు ధర రూ.4,300కి పైగా ఉన్న పత్తి ధర సోమవారం రూ.4,050కి పడిపోవడంతో ధర పెంచాలని రైతులు ఆందోళన చేపట్టారు. మద్దతు ధరతో కొనుగోలు చేయాల్సిన సీసీఐ రైతులకు గుర్తింపు కార్డు లేకపోవడంతో పత్తి కొనుగోలుకు నిరాకరించారు. వ్యాపారులు ధర తగ్గించడం, సీసీఐ కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు అధికారుల తీరుపై మండిపడ్డారు. తమకు కనీస ధర లేకపోవడంతో తీవ్రంగా నస్టపోతున్నామని రైతులు అన్నారు. ఎకరాకు పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. అలాగే దళారులతో మోసపోతున్నామని అన్నారు. అధికారులు మద్దతు ధరలు చెల్లించడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలు ఇవ్వకుండా మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఎంతో వ్యయ ప్రయాసాల కొర్చి పంట పండిస్తే మద్దతు ధర ఇవ్వరా ? తమ కష్టాలు ఎవరు తీర్చాలి ? సమస్యలు ఎవరు వినాలి ? తమ క్షేమం కోసం చర్యలు తీసుకోవాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా ? ఎన్నాళ్లీ ఇబ్బందులు అంటూ పత్తి రైతు కన్నెర్ర చేశాడు. ఏకంగా వ్యవసాయ కార్యాలయంపై దాడికి యత్నించారు.  కార్యాలయం అద్దాలు పగులగొట్టారు. అక్కడి ఫర్నీచర్‌ ను ధ్వంసం చేశారు. పత్తిలో తేమను 16 శాతానికి పెంచి క్వింటాలుకు రూ.6వేల ధర చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ నిరసనకు దిగారు. రైతులు చేపట్టిన ఆందోళనపై పోలీసులు రంగ ప్రవేశం చేశారు. రైతులను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.  తాము పండించిన పత్తికి అధిక ధర పలుకుతుందని ఆశించారు. కానీ వారి ఆశలను సీసీఐ అధికారులు, దళారులు కుమ్మక్కయి తమకు నఅ/-యయం చేస్తున్నారని వారు మండిపడ్డారు. మొత్తం జిల్లాల్లో ఉన్న 14 సీసీఐ కేంద్రాల్లో 400 క్వింటాళ్ల పత్తిని అధికారులు కొనుగోలు చేశారు. పంటకు సరియైన ధర పెట్టకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సీసీఐ అధికారులు..దళారులు రింగ్‌ గా ఏర్పడి తమను దోచేసుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. వ్యాపారులు మాత్రం 1.50 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తేమ విషయంలో అధికారులు తమను మోసం చేస్తున్నారని, వెంటనే తమకు న్యాయం చేయాలని పత్తి రైతులు డిమాండ్‌ చేశారు.