ఆదివాసీ హక్కులను కాపాడాలి
12న మన్యంలో ఆందోళన
ఏలూరు,జూన్8(జనం సాక్షి): అటవీ హక్కుల చట్టం, ఆదివాసీల హక్కులపై ప్రభుత్వాలు ఆలోచన చేయాలన్న డిమాండ్ పెరుగుతోంది. అటవీ హక్కుల చట్టాలను అమలుపర్చాలి, అడవులపై ఆదివాసీల హక్కులను గౌరవించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ సంఘాల సమాఖ్య గౌరవాధ్యక్షలు ఆరిక కృష్ణారావు తదితరులు పదేపదే ఆదివాసీల సమస్యలపై పోరాడుతూనే ఉన్నారు. ఇదిలావుంటే పోలవరం ప్రభావిత ముంపు ప్రజలకు పునరావాసం కల్పన, సమగ్ర అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన తలపెట్టిన మన్యం ప్రజా ఆందోళన కార్యక్రమానికి విలీన మండలాల ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పార్టీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భగా ఐటిడిఎ ముట్టడి కార్యక్రమానికి 13 డిమాండ్లతో కూడిన గోడ పత్రికలను ఆవిష్కరించారు. నాలుగేళ్లుగా ముంపు మండలాల ప్రజలు దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంతో మారుమూల గిరిజన గ్రామాల ప్రజలు మౌలిక సౌకర్యాల్లేక ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ముంపు మండలాల్లో విద్య, వైద్యం కుంటుపడిందన్నారు. ఐటిడిఎ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వాసితులందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.