ఆధారంగానే నగదు బదిలీ

మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్‌, ఫిబ్రవరి 12(జనంసాక్షి) :
ఆధార్‌ ఆధారంగానే నగదు బదిలీ చేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. మంగళవారం సచివాలయంలో సంబంధిత శాఖ అధికారులతో ఆధార్‌కార్డుల ప్రక్రియపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ వచ్చే మూడు నెలల్లోగా రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఆధార్‌కార్డులు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎనిమిది కోట్ల 50లక్షల జనాభాలో ఇప్పటి వరకు ఆరుకోట్ల 52 లక్షల మంది ఆధార్‌కార్డు కోసం పేర్లు నమోదు చేసుకున్నారని అన్నారు. వారిలో 5.20 లక్షల మందికి ఆధార్‌కార్డులు పంపిణీ చేశామన్నారు. గ్యాస్‌ పంపిణీకి ఆధార్‌కార్డుల అనుసంధానం గడువు మరింత పొడిగించడంపై కేంద్రం నుంచి
ఎలాంటి అధికారిక సమాచారం రాలేదన్నారు. వీలైతే బుధవారం ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి వీరప్పమొయిలీని కలిసి మరోసారి విజ్ఞప్తి చేయనున్నట్టు తెలిపారు. అయితే దీనిపై కేంద్రం గడువును పెంచే విధంగా నిర్ణయం తీసుకుంటుందన్న ఆశాభావం వెల్లడించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలో ఆధార్‌కార్డుల పంపిణీ వేగవంతం చేసేందుకు అదనంగా మరో 1900 సెంటర్లను ప్రారంభించనున్నట్లు మంత్రి తెలిపారు. గతంలో ఆధార్‌కార్డుల పేర్లను నమోదు చేసుకొని యూఐడి నంబర్‌ రాని వారి కోసం ఆధార్‌ పరిష్కారం కోసం ప్రత్యేక సేవలను ప్రారంభించబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఈనెల 18 నుంచి ఈ సేవలను నంబర్‌ రానివారు వినియోగించుకోవచ్చునని ఆయన తెలిపారు. గతంలో ఫొటోలు దిగి, ఆధార్‌కార్డు రానివారి కోసం మీసేవ కేంద్రాల నుంచి అందించనున్నట్లు మంత్రి తెలిపారు. వచ్చే సోమవారం నుంచి మీ సేవ కేంద్రాల నుంచి గతంలో ఫొటోలు దిగి, కార్డులు రానివ్వరు తిరిగి కొత్తకార్డులు పొందవచ్చునని ఆయన అన్నారు. ఆధార్‌కార్డు సమస్య పరిష్కారం కోసం 1100 నంబర్‌కు డయల్‌ చేస్తే పరిష్కారం సూచిస్తారని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న పలు సంక్షేమ కార్యక్రమాలకు కూడా ఆధార్‌కార్డుతో అనుసంధానం చేయనున్నట్లు మంత్రి తెలిపారు.