ఆధారాలు సేకరిస్తున్నాం.. వారంలోగా నివేదిక.

ఫోరెన్సిక్‌ నిపుణులు
పెద్ద పెద్ద శబ్దాలు విన్పించాయి..
పలువురు ప్రయాణికులు
హైదరాబాద్‌, జూలై 31 : ఆధారాలను సేకరిస్తున్నాం.. వాటిని పరిశీలిస్తున్నాం.. అంతేగాక పరీక్షలు జరపాల్సి ఉంది.. ఆ తర్వాతే నివేదిక ఇస్తామని ఫోరెన్సిక్‌ నిపుణులు పలువురు తెలిపారు. మంగళవారం ఉదయం నెల్లూరు రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వారు దగ్ధమైన బోగీని పరిశీలించారు. ఆధారాల కోసం శ్రమిస్తున్నారు.
కొంత సమయం పడుతుంది : గోపినాధ్‌
ప్రమాదానికి గల కారణాలను కనుగొనేందుకు వచ్చామని.. ప్రస్తుతం పరిశీలిస్తున్నామని హైదరాబాద్‌కు చెందిన ఫోరెన్సిక్‌ టీమ్‌కు చెందిన గోపీనాధ్‌ అనే అధికారి చెప్పారు. మంగళవారం ఉదయం నెల్లూరు రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన దగ్ధమైన బోగిని పరిశీలిస్తున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఆధారాల సేకరణ ప్రక్రియ కొనసాగుతోందని.. అన్నింటిని పరిశీలించి.. అందరితో చర్చించాకే ఏం జరిగిందన్నది తేలుతుందని.. అందుకు కొంత సమయం పడుతుందని.. అప్పటివరకు వేచి ఉండాల్సిందేనని తెలిపారు. పూర్తిగా పరిశీలించి సమీక్షించాకే అధికారులకు నివేదిక అందజేయడం జరుగుతుందన్నారు. అది ఎంత సమయం అన్నది చెప్పజాలమన్నారు.
జాప్యానికి బాధ్యులు వారే.. : డిఎం అండ్‌ హెచ్‌ఓ
ఒక మృతదేహం కోసం ముగ్గురు వచ్చి పోటీపడుతుండడంతో.. మృతదేహాల గుర్తింపు ప్రక్రియ మందకొడిగా సాగుతోందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ మాసీలామణి తెలిపారు. రాత్రి వరకు 12 మృతదేహాల ఆచూకిని గుర్తించామని, వారి బంధువులకు అప్పగించామన్నారు. మరో ఇద్దరు మంగళవారం ఉదయం వచ్చి రెండు మృతదేహాలను గుర్తించడంతో వారికి అప్పగించామన్నారు. దీంతో మొత్తం 14 మంది మృతదేహాల గుర్తింపు ప్రక్రియ ముగిసినట్టయిందన్నారు. మరో 14 మృతదేహాలను గుర్తించాల్సి ఉందన్నారు. అవి గుర్తు పట్టలేనంతగా ఉండడంతో డిఎన్‌ఎ పరీక్షలకు పంపనున్నట్టు చెప్పారు. తమ వారి ఆచూకి లభించని వాళ్లు వచ్చి తప్పనిసరిగా రక్తం, డిఎన్‌ఎ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. వాటి ద్వారానే సరిపోల్చుకుని మృతదేహాలను అప్పగిస్తామని స్పష్టం చేశారు.
పెద్ద పెద్ద శబ్దాలు విన్నాను.. ప్రయాణీకుడు మదన్‌లాల్‌
చెన్నయ్‌కు వెళ్లేందుకువిజయవాడలో సోమవారం రాత్రి 12గంటల 51 నిమిషాలకు తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌ ఎక్కానని.. ఎస్‌-11లో 72వ బెర్త్‌ తనది కాగా..69వ నంబరు బెర్తు తమ తోడల్లుడుది అని మదన్‌లాల్‌ అనే ప్రయాణికుడు చెప్పారు. బెర్తుపైకి చేరగానే నిద్రపోయానని చెప్పారు. పెద్ద శబ్దం రావడంతో మెలకువ వచ్చిందని, బోగీ అంతా చిమ్మచీకటి.. పొగ వస్తుండడంతో గబాల్న దిగి డోర్‌ దగ్గరకు వెళ్లానని.. తలుపు తెరుచుకోవడంతో తన తోడల్లుడి కోసం కేక పెట్టానని.. అతను తన దగ్గరికి వచ్చే సమయానికి మరోసారి పేలుడు విన్పించిందని.. తమ ఇద్దరితో పాటు మరో పదిమంది దూకినట్టు గుర్తించానన్నారు. అప్పుడు సమయం 4.30 గంటలైనట్టు గుర్తించానన్నారు. తాము ఉన్న చోట గుడిసెలు ఉన్నాయని, వారిని లేపి ఇదే ప్రాంతమని అడిగానని.. వారు నెల్లూరు అని చెప్పడంతో ఊపిరిపీల్చుకున్నామని చెప్పారు. తాను బెర్తుపై నిద్రలో ఉన్నప్పుడు ఒకసారి.. అక్కడి నుంచి బయటకు దూకే సమయంలో మరో రెండుమూడు సార్లు పెద్ద పెద్ద శబ్దాలను ఆలకించామని చెప్పారు. కేవలం నాలుగైదు నిమిషాల్లోనే పెద్ద శబ్దాలు విన్పించాయని తెలిపారు. ఏదో శబ్దం రావడం వల్లే తనకు మెలకువ వచ్చిందని చెప్పారు. ఇదిలా ఉండగా మదన్‌లాల్‌కు స్వల్ప గాయాలు కావడంతో నెల్లూరులోని బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో తమకు ఎదురైన సంఘటనలను, విషయాలను.. మంగళవారం ఉదయం తనను కలిసిన మీడియాకు పై విధంగా తెలియజేశారు. ఇదిలాఉండగా సురేష్‌ అనే మరో ప్రయాణికుడు మీడియాతో మాట్లాడుతూ తాను ఎస్‌-11 బోగీలో 20వ నంబరు బెర్తుపై ఉన్నానని, పెద్ద శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచానని.. అప్పటికే పొగ దట్టంగా అలుముకుందని.. ఊపిరి తీసుకోవడం కూడా కష్టమవుతుండడంతో.. సమీపంలోని తలుపు వద్దకు చేరుకున్నానని..తలుపు తీసి ఉండడంతో బయటకు దూకేశానని తెలిపారు. అప్పుడు మామూలుగా ఊపిరి తీసుకోగలిగానని చెప్పారు.అప్పటివరకు పొగతో తాను ఉక్కిరిబిక్కిరయ్యా నన్నారు. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిన కొందరు తమకు ఎదురైన సంఘటనలను వివరించారు.