ఆనందీబెన్ రాజీనామా ఆమోదం
– భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశం
– కొత్తనేతను ఎన్నుకునేందుకు పరిశీలకుల నియామకం
న్యూఢిల్లీ,ఆగస్టు 3(జనంసాక్షి): గుజరాత్ సిఎం ఆనందిబెన్ రాజీనామాను బిజెపి కేంద్ర పార్లమెంటరీ బోర్డు అంగీకరించింది. ఆమె స్థానంతో కొత్త నేతను ఎన్నుకునేందుకు గురువారం నిర్ణయం తీసుకుంటారు. ప్రధాని మోడీ నివాసంలో పార్టీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బెన్ రాజీనామా వ్యవహరాన్ని చర్చించారు. ప్రధాని నరేంద్రమోదీతో పాటు కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మాస్వరాజ్, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా తదితరులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు విూడియాతో మాట్లాడుతూ.. గుజరాత్ సీఎం ఆనందీబెన్ రాజీనామాలేఖ ప్రధానికి అందిందని, ఆనందీబెన్ రాజీనామాను భాజపా పార్లమెంటరీ బోర్డు ఆమోదించిందని తెలిపారు. ఆనందీబెన్ రాజ్‌భవన్‌కు వెళ్లి రాజీనామా లేఖను గవర్నర్‌కు అందజేస్తారని వెల్లడించారు. గుజరాత్ కొత్త ముఖ్యమంత్రి అంశంపై సమావేశంలో చర్చించామని వెల్లడించారు. ఆనందీబెన్ గత 18ఏళ్గుగా మంత్రివర్గంలో ఉన్నారు.. యువ నాయకత్వం రావాలని అమె కోరుకుంటున్నారు. యువనాయకత్వం కోసమే ఆనందీబెన్ రాజీనామా చేశారని స్పష్టం చేశారు. గుజరాత్‌కు పరిశీలకుల కమిటీని పంపిస్తామని, సీఎం ఎంపిక ముందు పార్టీ ఎమ్మెల్యేలతో పరిశీలకుల కమిటీ చర్చిస్తుందని తెలిపారు. గుజరాత్ కొత్త సీఎం ఎంపికపై ఇద్దరు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తెలిపారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ నేత సరోజ్ పాండేలు ఆ కమిటీలో ఉన్నారని, వారిద్దరూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా సమక్షంలో గుజరాత్ నేతలతో చర్చిస్తారని తెలిపారు. కమిటీ నివేదిక తర్వాత గుజరాత్ కొత్త సీఎంను ప్రకటిస్తామన్నారు. అయితే అమిత్‌షా గుజరాత్ సీఎం అవుతారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని, అమిత్‌షా బీజేపీ అధ్యక్షుడిగానే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. యువనాయకత్వం రావాలని ఆనందీబెన్ కోరుకున్నారని అన్నారు. ఆనందీబెన్ నిర్ణయాన్ని అభినందిస్తున్నామని వెంకయ్య తెలిపారు. గుజరాత్ ముఖ్యమంత్రి అమిత్ షానే అన్న పుకార్లను కొట్టిపారేసింది బీజేపీ. ఇవాళ ప్రధాని నరేంద్ర మోదీ నివాసంలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం సీఎం అభ్యర్థిపై స్పష్టతనిచ్చింది. అమిత్‌షా బీజేపీ అధ్యక్షుడిగానే కొనసాగుతారని, గుజరాత్ సీఎం ఎవరో నిర్ణయించేది కూడా ఆయనేనని వెంకయ్యనాయుడు వెల్లడించారు. జాతీయస్థాయిలో పార్టీకి అమిత్ షా సేవలు అవసరమని వెంకయ్య తెలిపారు. పార్టీ ఎమ్మెల్యేలు గురువారం తమ కొత్త నేతను ఎన్నుకుంటారని స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి రేసులో రాష్ట్ర బీజేపీ చీఫ్ విజయ్ రూపాని, సీనియర్ మంత్రి నితిన్ పటేల్ ముందు వరుసలో ఉన్నారు. జైన్ నేత అయిన రూపాని అటు మోదీ, ఇటు అమిత్ షాకు సన్నిహితుడు. పైగా రాష్ట్ర రాజకీయాలపై మంచి పట్టుంది. మరోవైపు పటేల్ సామాజిక వర్గానికి చెందిన నితిన్ పటేల్ ఇప్పటికే కేబినెట్‌లో కొన్ని కీలక మంత్రిత్వ శాఖలు చేపట్టారు. గుజరాత్‌లో పటేల్ ఉద్యమ సమయంలో ఆందోళనకారులతో చర్చలు జరిపింది కూడా ఈయనే. అయితే ఈ ఉద్యమ నేత హార్దిక్ పటేల్ అరెస్ట్‌ను ఆపడంలో నితిన్ విఫలమవడం ఆ ఉద్యమ నాయకులకు ఆయన్ని దూరం చేసింది. ఈ ఇద్దరు కాకుండా సీఎం రేసులో కేంద్రమంత్రి పురుషోత్తమ్ రూపాలా, అసెంబ్లీ స్పీకర్ గణ్‌పత్ వసావా ఉన్నారు. ఇప్పటివరకు సీఎంగా ఉన్న ఆనందిబెన్ పటేల్ బుధవారం గవర్నర్‌ను కలిసి అధికారికంగా తన రాజీనామా లేఖను అందజేయనున్నారు. 75 ఏళ్ల వయసులో పదవిలో కొనసాగడం సరికాదని భావించిన ఆనంది నిర్ణయాన్ని పార్లమెంటరీ బోర్డు అభినందించింది. అయితే దేశ రాజకీయాల్లో ఇప్పుడు గుజరాత్ విషయమే హాట్ టాపిక్‌గా మారింది. ఆవు చర్మాన్ని ఒలిచారంటూ దళితులపై దాడి నేపథ్యంలో బీఎస్‌పీ చీఫ్ మాయావతి బాధితులను పరామర్శించేందుకు గుజరాత్‌లోని ఉనా వెళ్తున్నారు. ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. గుజరాత్ కూడా అదే బాటలో ఉంది. ఇలాంటి సంక్లిష్ట సమయంలో దళితులు, పటేళ్ళ ఆదరాభిమానాలను సంపాదించడం ఎలా? ఇవన్నీ బీజేపీకి ఎదురవుతున్న చిక్కు ప్రశ్నలు. ఆనంది బెన్ పటేల్ వారసులుగా ఇద్దరుముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. అయితే అమిత్ షా ముఖ్యమంత్రి అయితే నరేంద్ర మోదీ మాదిరిగా రాష్ట్రంపై గట్టి పట్టు సాధిస్తారని ఓ వర్గం అభిప్రాయపడుతోంది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్, దళితులు, పటేళ్ళు ఇలా అన్ని సవాళ్ళను తిప్పికొట్టాలంటే ఆయనే దీటైన నేత అని అంటోంది. మరికొందరి అభిప్రాయం ప్రకారం ఉత్తర ప్రదేశ్ అత్యంత కీలకమైన రాష్ట్రం. ఢిల్లీ, బీహార్ రాష్ట్రాలు చేజారిపోయిన నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్ శాసనసభ ఎన్నికలు ప్రతిష్ఠాత్మకమైనవి. ఈ ఎన్నికల్లో తప్పనిసరిగా గెలిచి, పార్టీ ప్రాభవాన్ని పెంచుకోవాలి. ఇంత కీలకమైన తరుణంలో అమిత్ షా బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే దాని ప్రభావం ఉత్తర ప్రదేశ్ ఎన్నికలపై కచ్చితంగా పడుతుంది. పార్టీ గేమ్ ప్లాన్ మొత్తం మారిపోతుంది. మోదీకి అత్యంత సన్నిహితుడైన అమిత్ షా ఢిల్లీ నుంచి బయటికి వెళ్తే సంస్థాగతంగా కీలక సమస్యలు ఎదురవుతాయి. అయితే అమిత్‌షా సిఎంగా వెళ్లరని వెంకయ్య స్పష్టం చేయడంతో బలమైన వ్యక్తికి పగ్గాలు అందించాల్సి ఉంది.