ఆన్‌లైన్‌లో పైరసీ సినిమాలు చూడటం నేరం కాదు

sqixdnnz copy
ముంబయి హైకోర్టు

ముంబయి: ఆన్‌లైన్‌లో పైరసీ సినిమాలు చూడటం నేరం కాదని ముంబయి హైకోర్టు తీర్పునిచ్చింది. జస్టిస్‌ గౌతమ్‌ కుమార్‌తో కూడిన ధర్మాసనం ఈ సంచలన తీర్పును వెలువరించింది. అయితే వీటిని పబ్లిక్‌గా చూడటం, డౌన్‌లోడ్‌ చేసుకోవడం లేదా ఇతరులకు షేర్‌ చేయడం వంటివి నేరం కిందకే వస్తాయని పేర్కొంది. ఇటీవల కాలంలో పైరసీ ఎక్కువయిందని అందువల్ల తాము చాలా నష్టపోతున్నామని ముంబయి ఫిల్మ్‌ ప్రొడ్యూసర్ల సమాఖ్య ముంబయి హైకోర్టులో కేసు వేసింది. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది. ఇలాంటి కార్యకలాపాలకు వేదికగా ఉన్న కొన్ని వెబ్‌సైట్లను బ్లాక్‌ చేయమని ముంబయి హైకోర్టు ఇటీవలే ఇంటర్నెట్‌ సర్వీస్‌ ప్రొవైడర్లకు(ఐఎస్‌పీ) ఆదేశాలు జారీ చేసింది. కానీ, దీని వల్ల కొన్ని సాధారణ వెబ్‌సైట్లు కూడా మూసుకుపోయాయి. దీంతో పైరసీ వీడియోలు చూసే సైట్‌లోకి వెళ్లేముందు ఎర్రర్‌ మెసేజ్‌ ప్రత్యక్షమయ్యేలా చర్యలు తీసుకోవాలని ముంబయి హైకోర్టు ఐఎస్‌పీలకు సూచించింది. అంతేకాకుండా ఆ వీడియోలు డౌన్‌లోడ్‌ కాకుండా జాగ్రత్తపడాలని కోరింది. ప్రతి ఐఎస్‌పీ ఒక నోడల్‌ ఆఫీసర్‌ను నియమించుకోవాలని, వినియోగదారుల సమస్యలను రెండు రోజుల్లో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది.