ఆప్‌ ర్యాలీలో విషాదం

5

-రైతు ఆత్మహత్య

-అన్నదాతల ఆత్మహత్యలకు కేంద్రానిదే బాధ్యత

-మోదీ సర్కార్‌ రైతులను మోసం చేస్తుంది : కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 22 (జనంసాక్షి):

ఆప్‌ ఆధ్వర్యంలో భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఆప్‌ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో పాల్గొనడానికి రాజస్థాన్‌నుంచి వచ్చిన ఒక రైతు చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యా  చేసుకున్నాడు.   ఆప్‌ కార్యకర్తలు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. రైతు మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. రాజస్థాన్‌ నుంచి వచ్చిన ఆ రైతు పేరు గజేందర్‌ సింగ్‌ అని తెలిసింది. అతని వద్ద ఆత్మహత్యకు సంబంధించి నోట్‌కూడా దొరికినట్లు తెలుస్తోంది. ర్యాలీ అనంతరం ఆస్పత్రికి వెళ్లిన ఆప్‌ అధినేత, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ రైతు మృతి పట్ల విచారం వ్యక్తంచేశారు. తమ క్లళెదురుగానే ఈ సంఘటన జరిగినా తామేవిూ చేయలేకపోయామని ఆయన ఆవేదన చెందారు. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రైతు వ్యతిరేక, ధనికుల అనుకూల ప్రభుత్వమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజీవ్రాల్‌ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూసేకరణ సవరణ ఆర్డినెన్సుకు నిరసనగా బుధవారం  దిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఆప్‌ ర్యాలీ చేపట్టింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘భాజపా ప్రభుత్వ విధానాలన్నీ రైతు వ్యతిరేకంగా ఉన్నాయన్నారు.  ఏడాది క్రితం మోదీ విూద ప్రజలు ఎంతో నమ్మకముంచి ఓట్లు వేశారు. దాన్ని ఆయన నిలబెట్టుకోలేక పోతున్నారు. భూసేకరణపై ఆర్డినెన్సు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆర్డినెన్సును అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడాలన్న విషయం ప్రభుత్వానికి తెలియదా?’ అంటూ ప్రశ్నించారు. ఈ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా తమ ప్రభుత్వం పోరాడుతుందన్నారు. రైతులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వబోమన్నారు.