ఆమె హిందూ వ్యతిరేకి.

 అందుకే చంపేశాం!
జర్నలిస్ట్‌ గౌరీలంకేష్‌ హత్యకేసులో నిందితుడు వెల్లడి
బెంగళూరు, జూన్‌8(జ‌నం సాక్షి) : జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్యే కేసులో అరెస్టయిన తొలి నిందితుడు కేటీ నవీన్‌ కుమార్‌ తన నేరాన్ని అంగీకరించాడు. గౌరీ లంకేష్‌ హిందూ వ్యతిరేకి అయినందు వల్ల ఆమెను చంపుతున్నామని ఓ అతివాద గ్రూపు సభ్యుడు చెప్పాడని, దానికి తానే బుల్లెట్లను సరఫరా చేశానని నవీన్‌ విచారణలో పోలీసులకు చెప్పాడు. ఆయుధాల డీలర్‌ అయిన నవీన్‌.. ప్రొఫెసర్‌ కేఎస్‌ భగవాన్‌ హత్యకు కుట్ర పన్నిన కేసులోనూ నేరాన్ని అంగీకించాడు. హేతువాది అయిన కాల్‌బుర్గిని హత్య చేసిన తర్వాత ప్రొఫెసర్‌ భగవాన్‌కు రక్షణ కల్పించారు. గౌరీ లంకేష్‌ హత్య కేసులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో నవీన్‌కుమార్‌కు ఇచ్చిన 12 పేజీల స్టేట్‌మెంట్‌ను కూడా పోలీసులు చేర్చారు. 131 పాయింట్లను ఆధారాలుగా ఈ చార్జిషీటులో చూపించిన పోలీసులు.. హంతకులు హత్యకు వాడిన రూట్‌ మ్యాప్‌ను కూడా అందులో పొందుపరిచారు. ఈ నవీన్‌కుమారే 2014లో హిందు యువ సేనను ప్రారంభించాడు.
మైసూర్‌లో కామర్స్‌ చదువును మధ్యలోనే ఆపేసిన నవీన్‌.. ఆ తర్వాత అతివాద సిద్ధాంతానికి ఆకర్షితుడై అటువైపు మళ్లాడు. అతడో అక్రమ ఆయుధ వ్యాపారి కూడా. ప్రతి ఏటా నవీన్‌ హిందూ జాగృతి సమితి సమావేశాలకు వెళ్లేవాడు. అక్కడ ప్రవీణ్‌ అనే ఓ వ్యక్తి కలిసి బుల్లెట్లు కావాలని అడిగినట్లు నవీన్‌ విచారణలో చెప్పాడు. మొదట్లో రెండు బుల్లెట్లు ఇవ్వగా అవి బాగా లేవని, తనకు మంచి బుల్లెట్లు కావాలని అడిగినట్లు తెలిపాడు. అవి జర్నలిస్ట్‌ గౌరీ లంకేష్‌ హత్య కోసం అని కూడా అతను చెప్పాడని నవీన్‌ వెల్లడించాడు. బెంగళూరు, బెల్గామ్‌లలో హత్యకు ప్రణాళిక రచించారు. ఆ తర్వాత కొత్త బుల్లెట్లు ప్రవీణ్‌కు ఇవ్వడానికి ప్రయత్నించినా అతని దగ్గర మొబైల్‌ లేకపోవడంతో కలవలేకపోయానని పోలీసులకు చెప్పాడు. సెప్టెంబర్‌ 5న గౌరీ లంకేష్‌ హత్య జరిగినట్లు తాను మరుసటి రోజు మంగళూరులో పత్రికలు చూసిన తర్వాత
తెలుసుకున్నానని నవీన్‌ వెల్లడించాడు.