ఆయన మూడు..ఈయన ఐదు నిమిషాలు..
అయిదురోజుల పాటూ..వాయిదాల పర్వం
శాసనసభ సమావేశాల తీరుపై విపక్షాల పెదవివిరుపు
ఆయన మూడు..ఈయన ఐదు నిమిషాలు..
అయిదురోజుల పాటూ..వాయిదాల పర్వం
శాసనసభ సమావేశాల తీరుపై విపక్షాల పెదవివిరుపు
హైదరాబాద్, సెప్టెంబర్ 23 (జనంసాక్షి):ఆయన మూడు నిమిషాలు.. ఈయన ఐదు నిమిషాలు మాత్రమే మాట్లాడారు.. మిగిలిన వారిలో చాలామంది మాట్లాడలేకపోయారు. వాయిదాల పర్వం కొనసాగడంతో అయిదు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో కొందరు సభ్యులు మాట్లాడలేకపోయారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మూడు నిమిషాలు మాత్రమే మాట్లాడితే తెలుగుదేశంపార్టీ అధినేత చంద్రబాబునాయుడు అయిదు నిమిషాల సమయం మాత్రమే మాట్లాడారు. అయిదు రోజులకు గాను సభ కేవలం 4 గంటల 10 నిమిషాల పాటు మాత్రమే సమావేశమైంది. మిగిలిన సమయమంతా వాయిదాలతోనే ముగిసిపోయింది. ఇదిలా ఉండగా టిఆర్‌ఎస్ సభ్యుడు ఈటెల రాజేందర్ 11 నిమిషాలు మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సిపి గౌరవ అధ్యక్షురాలు, ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ మూడు నిమిషాలు, సిపిఐ సభ్యులు గుండా మల్లేష్ నాలుగు నిమిషాలు, బిజెపి సభ్యులు జి.కిషన్‌రెడ్డి ఆరు నిమిషాలు, సిపిఎం సభ్యులు జూలకంటి రంగారెడ్డి ఏడు నిమిషాలు, లోక్‌సత్తా అధినేత ఆరు నిమిషాలు మాత్రమే మాట్లాడారు. అస్సలేమీ మాట్లాడని సభ్యునిగా అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం) నిలిచారు. పార్టీల వారీగా సభ సమయాన్ని వినియోగించుకున్న తీరు ఇలా ఉంది. కాంగ్రెస్ పార్టీ 66 నిమిషాలు, తెలుగుదేశం పార్టీ 39 నిమిషాలు, టిఆర్‌ఎస్ 52 నిమిషాలు, మజ్లిస్ 6 నిమిషాలు, సిపిఐ 14 నిమిషాలు, వైఎస్‌ఆర్‌సిపి 18 నిమిషాలు, సీపీఎం 12 నిమిషాలు, లోక్‌సత్తా 6 నిమిషాలు, బిజెపి 20 నిమిషాలు, ఇండిపెండెంట్లు 17 నిమిషాలు మాత్రమే వినియోగించుకున్నాయి. అయిదు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో కేవలం సభ 250నిమిషాలు (4గంటల 10 నిమిషాలు) మాత్రమే కొనసాగింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 17వ తేదీన ప్రారంభమై 22వ తేదీతో ముగిసిన విషయం తెలిసిందే. వినాయకచవితి పర్వదినం సందర్భంగా 19వ తేదీన సెలవు అన్న విషయం విదితమే. స్వాతంత్య్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, మాజీ ఎమ్మెల్యేల మృతికి సంతాప తీర్మానం ఒక్కటే సభలో సజావుగా కొనసాగింది.
వాయిదాల పర్వం ఇలా..
తొలిరోజు (17న) 9 గంటలకు ప్రారంభం.. 9.07 నిమిషాలకు తొలి వాయిదా ప్రారంభం.. 10.10గంటలకు ప్రారంభం.. వాయిదా.. 10.42కి కొలువుదీరగా.. మరుసటి రోజుకు వాయిదా.
రెండోరోజు (18న) 9గంటలకు ప్రారంభం.. వాయిదా.. 10.20కి ప్రారంభం.. వాయిదా.. 12.30 గంటలకు మళ్లీ ప్రారంభం.. ఆ తర్వాత 20వ తేదీకి వాయిదా.
మూడో రోజు (20న).. 9 గంటలకు ప్రారంభం..కొద్ది నిమిషాలకే వాయిదా.. 10.5కి ప్రారంభం.. వాయిదా. 11.50కి ప్రారంభం.. 21వ తేదీకి వాయిదా.
నాల్గో రోజు (21న).. 9 గంటలకు ప్రారంభం.. వాయిదా.. 10.20కి ప్రారంభం.. వాయిదా.. 12.30కి ప్రారంభం.. కొండా లక్ష్మణ్‌బాపూజీ మృతి పట్ల సంతాపం..మధ్యాహ్నం 2గంటల సమయంలో మరుసటిరోజుకు వాయిదా..
ఐదో రోజు (22న).. 9 గంటలకు ప్రారంభం.. పావు గంట సేపు వాయిదా. 10.40గంటలకు ప్రారంభం.. వాయిదా.. 11.55 గంటలకు ప్రారంభం..వాయిదా..మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభం.. నిరవధిక వాయిదా.
ఔను.. పారిపోయారు..!
అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు వాయిదాలకే పరిమితమయ్యాయి. ఎటువంటి బిల్లులను సభలో ప్రవేశపెట్టలేదు. అయిదు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో ఏ అంశంపై కూడా చర్చ సాగలేదు. సభ జరక్కపోవడానికి ప్రతిపక్షాలే కారణమని ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి చెబుతుండగా.. సభను నడిపించడంలో ప్రభుత్వం విఫలమైందని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సభ్యులు ఆరోపించారు. ప్రజా సమస్యలపై చర్చించకపోవడం.. వాయిదాల పర్వాన్ని కొనసాగించడం రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో ఇదే తొలిసారి అని సిపిఐ నేత కె.సాంబశివరావు అన్నారు. సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం వాయిదాల పేరిట చాప చుట్టేసిందన్నారు. శాసనసభ నిర్వహణ కోసం అయిన ఖర్చును ప్రభుత్వం నుంచి రాబట్టాలని సీపీఎం సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. తెలంగాణపై తీర్మానం చేయాల్సి వస్తుందనే ప్రభుత్వం పారిపోయిందని బిజెపి సభ్యుడు లక్ష్మీనారాయణ అన్నారు. ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కుమ్మక్కై సభను సాగనీయకుండా కుట్ర పన్నాయని టిఆర్‌ఎస్ సభ్యులు ఆరోపించారు. తెలంగాణపై తీర్మానం చేసేందుకు ఐదు నిమిషాల సమయమే పడుతుందని, చేపట్టాలని కోరినా విన్పించుకోకుం డాకుంటిసాకులతో వర్షాకాలసమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగించారని ఆరోపించారు.