ఆయేషా కేసులో సిబిఐ స్పీడ్
ముగ్గురు కోర్టు ఉద్యోగులపై కేసు
హైదరాబాద్,డిసెంబర్29(జనంసాక్షి): సంచలనం సృష్టించిన అయేషా విూరా హత్య కేసుకు సంబంధించి సీబీఐ.. దర్యాప్తులో వేగం పెంచింది. ఇందులో భాగంగా విజయవాడ కోర్టుకు చెందిన ముగ్గురు ఉద్యోగులపై కేసు నమోదు చేసింది. ఈ కేసులో సాక్ష్యాలు, పత్రాలను తారుమారు చేశారన్న ఆరోపణలపై ఈ చర్యలు చేపట్టింది. అయేషా విూరా కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు గత నెలలో కీలక ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. దర్యాప్తు పక్రియలో సీబీఐ స్వేచ్ఛతో వ్యవహరించొచ్చని తెలిపింది. కేసుకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు, సాక్ష్యాధారాలు, ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) జరిపిన దర్యాప్తు వివరాలన్నీ సీబీఐ వినియోగించుకోవచ్చని సూచించింది. ఈ మేరకు రంగంలోకి దిగిన సీబీఐ ఈ కేసును వేగంగా దర్యాప్తు చేస్తోంది. ఇప్పటికే ఒక ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది.