ఆరోగ్య గ్రామంగా ప్రకటించుకుందాం-సర్పంచ్ గన్నోజు సునిత శ్రీకృష్ణచారి.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
పరిసరాల శుభ్రతకు యువత ముందుకు రావాలి.
నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,జులై30(జనంసాక్షి):
వర్షాకాలంలో వ్యాప్తి చెందే వ్యాధుల పట్ల గ్రామంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉంటూ ఆరోగ్యం పై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పెద్ద కొత్తపల్లి మండలం మారెడుమాన్ దిన్నె గ్రామ పంచాయతీ సర్పంచ్ గన్నోజు సునిత శ్రీకృష్ణచారి అన్నారు.ఈ సందర్భంగా సర్పంచ్ గ్రామ ప్రజలకు కొన్ని సూచనలు, సలహాలను సూచించారు.వర్షాకాలంలో ఇంటిని మరియు ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.నీటిని నిల్వ చేసుకోవడం వల్ల తోక పురుగులు పుట్టుకొచ్చి రోగాలకు దారి తీస్తాయని వివరించారు.అలాగే ఇంటి ముందు చెత్త చెదారం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.పిచ్చిగడ్డి పెరగడం వల్ల విషపురుగులు వచ్చే అవకాశం ఉంటుంద న్నారు.ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగు గుంతలు లేకుండా చూసుకోవాలన్నారు. అపరిశుభ్రత కారణంగా వైరల్ జ్వరాలు,విష జ్వరాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు.చిన్న పిల్లలను, వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు.వర్షాకాలం పూర్తి అయ్యే వరకు తాగునీటిని కాచి,వడబోసి తాగాలని సూచించారు. దగ్గు,జ్వరం,కీలు నొప్పులు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని అన్నారు.ప్రతి ఒక్కరు పరిసరాల పరిశుభ్రత లో శ్రద్ధ వహిస్తూ మన గ్రామంలో ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్య గ్రామంగా ప్రకటించుకుందాం అని పిలుపునిచ్చారు. దీనికొరకు గ్రామస్తులు అందరూ,ముఖ్యంగా యువకులు ముందుకు వచ్చి సహకరించా లని కోరారు.