ఆరోగ్య తెలంగాణ కోసం ప్రభుత్వం కృషి

ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి

సైదాపూర్ జనం సాక్షి

నవంబర్ 3 ఆరోగ్య తెలంగాణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని ఎంపీపీల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, సైదాపూర్ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం మండలంలోని లస్మన్నపల్లి గ్రామంలో బిపి షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎన్సీడీ కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కాయిత రాములు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఉన్నతమైన జీవనానికి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని కోరారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటిస్తే సీజనల్ వ్యాధులు దరిచేరవన్నారు. వైద్యుల సలహా మేరకు మందులను వాడాలని విచక్షణ రహితంగా మందులను వాడకూడదని కోరారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు సులభంగా అర్థమయ్యే విధంగా ఎన్సీడీ కిట్లలో ఉదయం, మధ్యాహ్నం,రాత్రి వేళల్లో మందులను వేసుకునే విధంగా ప్రత్యేకంగా బ్యాగులను రూపొందించినట్లు పేర్కొన్నారు. అనంతరం వైద్యాధికారి కృష్ణారావు మాట్లాడుతూ …బీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులు నిర్లక్ష్యం చేస్తే గుండెపోటు, పక్షవాతం, కిడ్నీలు దెబ్బ తినడం, నరాలు చచ్చుబడిపోవడం, కంటిచూపు మందగించడం, పాదాలకు పుండ్లు వంటి తదితర వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం ఇందిరా, ప్రధానోపాధ్యాయురాలు కవిత, ఉపాధ్యాయురాలు అర్చన,ఆశ కార్యకర్త నిర్మల, గ్రామస్తులు పాల్గొన్నారు.

తాజావార్తలు