ఆర్టీసీలో ఛార్జీల పెంపు ?

pd3u8osiహైదరాబాద్ : ఒకరి కళ్లలో ఆనందం చూడాలంటే మరొకరిని బాధపెట్టాలి. ఒకరి జీవితంలో వెలుగులు నింపాలంటే మరొకరిని చీకట్లో ఉంచాలి. ఇదేం రూల్‌ కాకున్నా ఆర్టీసీ అధికారులు మాత్రం సరిగ్గా ఇదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. తాయిలం ఇవ్వాలంటే థండర్‌ పంచ్‌ ఇవ్వాల్సిందేనంటూ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. లాస్‌ రూట్లో నడుస్తున్న ఆర్టీసీని గట్టెక్కించాలన్నా, ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాలన్నా చార్జీల పెంపు ఒక్కటే మార్గమని ప్రతిపాదనలను ఉన్నతాధికారులు రెడీ చేసారు. అంతేకాదు ఇదే ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపారు.
పెంచిన చార్జీలు మే 15 తర్వాతే అమలు..
ఛార్జీల పెంపు లేకుండా పీఆర్సీ భారాన్ని ఆర్టీసీ భరిస్తే ఏటా సంస్థ పై 18వందలకోట్లు అదనపు భారం పడుతుంది. ఈ ఆర్ధిక భారాన్ని భరించాలంటూ ఇరు ప్రభుత్వాలనూ ఆర్టీసీ యాజమాన్యం కోరింది. తెలంగాణ సర్కార్ ఈ ప్రతిపాదనకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చినా ఏపి సర్కార్‌ మాత్రం డోలాయమానంలో ఉంది. అయితే ఏపి సర్కార్‌ మాత్రం ఇంతటి వ్యయ భారాన్ని భరించాలంటే ఛార్జీలు పెంచాలని డిసైడయింది. ఇదే నిజమయితే చార్జీల పెంపు మే 15తర్వాత నుంచి అమలుకావొచ్చని తెలుస్తోంది. అయితే ఈ ఛార్జీల పెంపు అంశంలో నుంచి పల్లె వెలుగు, పట్టణ సర్వీసులకు మినహాయింపు లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
ఛార్జీలు పెంచితే 700 కోట్ల ఆదాయం..
ఆర్టీసీ కార్మికులకు 33 శాతానికి పైగా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని రెండు ప్రభుత్వాలు యోచిస్తున్నాయి. ఇది వాస్తవ రూపంలోకి రావాలంటే ఎక్స్ ప్రెస్‌, లగ్జరీ, సూపర్‌ లగ్జరీ బస్సుల్లో 15 శాతం, ఏసీ బస్సుల్లో సుమారు 20 శాతం ఛార్జీలను పెంచాల్సి వస్తోందని చెబుతున్నారు. ఛార్జీలంటూ పెంచితే 700 కోట్లకుపైగా ఆదాయం వస్తుందని అంచనా. పల్లె వెలుగు, పట్టణ సర్వీసుల్లో పెంపు ఉండని కారణంగా డీజిల్‌పై వ్యాట్‌, రవాణా పన్నులో మినహాయింపు ఇవ్వాలని ఆర్టీసీ ఉన్నతాధికారులు కోరుతున్నారు. ఈ పన్ను మినహాయింపు కారణంగా మరో 500 కోట్లు ఆదా అవుతుందని మొత్తం కలుపుకుంటే ఆర్టిసీకి 1300 కోట్ల ఆదాయం వస్తుందని ఆర్టీసీ చెబుతోంది.
ఫిటింగ్ పెట్టడం సరికాదు..
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్ననాటి నుంచే ఆర్టీసీ లో కష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు సరైన రీతిలో పట్టించుకోని పరిస్థితుల్లో ఛార్జీల పెంపు మినహా మరో ప్రత్యామ్నాయం లేదని అధికారులు చెబుతున్నారు. ఆర్టీసీ పడుతున్న కష్టాలపై ఇరు రాష్ట్రాల రవాణాశాఖా మంత్రులు సరైన రీతిలో స్పందించడం లేదనే విమర్శలున్నాయి. ఇదీ చాలదన్నట్లు ఫిట్‌మెంట్ పేరుతో ఇలా అడ్డగోలుగా ఫిట్టింగ్‌ పెట్టడాన్ని సరికాదని కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి.