ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటాం

కేసీఆర్‌ బెదిరింపు ధోరణి మానుకోవాలి
నాలుగేళ్ల తరువాత రైతుబంధు అమల్లో ఆంతర్యమేంటి?
ఎన్నికల్లో గెలుపుకోసం కేసీఆర్‌ పాట్లు
2019లో కాంగ్రెస్‌దే విజయం
అధికారంలోకి రాగానే రూ. 2లక్షల రుణమాఫీ చేస్తాం
ఒక్క ఎకరం ఎండినా ఆదుకుంటాం
టీపీసీసీ ప్రెసిండెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి
పాల్వాయి విగ్రహాన్ని ఆవిష్కరించిన కాంగ్రెస్‌ నేతలు
నల్గొండ, జూన్‌9(జనం సాక్షి ) : ఆర్టీసీ కార్మికులను ముఖ్యమంత్రి బెదిరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. చండూర్‌లో దివంగత కాంగ్రెస్‌ నేత పాల్వాయి గోవర్దన్‌రెడ్డి విగ్రహాన్ని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వాయిలార్‌ రవి, పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌, సీఎల్పీ నేత జానారెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు సాధించుకునేందుకు వారికి అండగా ఉంటామన్నారు. సీఎం కేసీఆర్‌ ఆది నుంచి అందరినీ బెదిరించే ధోరణినే అనుసరిస్తున్నారని దుయ్యబట్టారు. నియంతృత్వంతోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేశారని చెప్పారు. తెలంగాణలో దుర్మార్గ పాలన సాగుతుందని మండిపడ్డారు. తెలంగాణ వ్యాప్తంగా నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు నైరాశ్యంలోకి నెట్టబడ్డారన్నారు. నాలుగేళ్ల తర్వాత రైతుకు పెట్టుబడి సాయం ఇవ్వడంలో ఆంతర్యమేంటని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే ఎందుకివ్వలేదని అడిగారు. ఇదంతా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసింది కాదా అని నిలదీశారు. రుణమాఫీ వడ్డీ భారాన్ని భరిస్తామని చెప్పి మాట తప్పారని ధ్వజమెత్తారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. అధికారంలోకి రాగానే రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఉత్తమ్‌ ప్రకటంచారు.
రుణమాఫీతో పాటు పంటలకు కేంద్రం ఇచ్చే మద్దతు ధరలకు అదనంగా బోనస్‌ కూడా ఇస్తామని హావిూ ఇచ్చారు. అంతేకాకుండా అద్భుతమైన పంటల బీమా పథకం తీసుకొస్తామని తెలియజేశారు. ఒక్క ఎకరా ఎండినా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. రైతులు చనిపోయాక కాదు.. బతికున్నప్పుడే ప్రభుత్వం ఎందుకు ఆదుకోలేదని నిలదీశారు. నాలుగేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ కాలేదన్నారు. కేసీఆర్‌ సీఎం అయినప్పుడు ఎన్ని ఖాళీలు ఉన్నాయో.. ఇప్పుడూ అవే ఉన్న మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. పాల్వాయి గోవర్దన్‌రెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో అరుదైన నేత అని కొనియాడారు. తెలంగాణ రాజకీయాల్లో ఆయన పాత్ర ప్రత్యేకమైందని చెప్పారు. 2019లో మునుగోడులో కాంగ్రెస్‌ అభ్యర్థిని గెలిపించి ఆయనకు నిజమైన నివాళులర్పించాలని కార్యకర్తలకు ఉత్తమ్‌ పిలుపునిచ్చారు.