ఆర్టీసీ బస్సుల బుకింగ్‌తో సామాన్యులకు కష్టమే

ఆదివారం ప్రయాణాలు వాయిదా వేసుకోక తప్పదు

ప్రైవేట్‌ వాహనాలన్నీ అద్దెకు బుక్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌30(జ‌నం సాక్షి): టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదనకు లక్ష మందినైతే తీసుకెళ్లాలనేది లక్ష్యంతో కనిపించిన వాహనాలను బుక్‌ చేస్తున్నారు. 415 ఆర్టీసీ బస్సులను టీఆర్‌ఎస్‌ ప్రగతి నివేదన సభ కోసం బుక్‌ చేసుకున్నారు. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులు మాత్రమే కొంగరకలాన్‌కు తరలనున్నాయి. ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ బస్సులు 627 ఉండగా, అందులో సుమారు మూడంతుల బస్సులు ఆ రోజున సభకు తరలనున్నాయి. ప్రధానంగా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ లాంటి బస్సులు అటు వెళ్తుండడంతో ఆ రోజు సామాన్య ప్రజలకు రవాణా కష్టాలు ఎదురయ్యే పరిస్థితి ఉంది. గ్రావిూణ ప్రాంతాలు, ఉమ్మడి జిల్లాలోని ముఖ్యమైన పట్టణాలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సులే అధికంగా తిరుగుతాయి. దీంతో సెప్టెంబర్‌ 2న ప్రయాణికులు సహకరించాలని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు. దీంతో ఆదివారం కర్ఫ్యూ వాతావరణం తప్పదేమోనని అంటున్నారు. గ్రామాలకు కనీసం ఒక్క బస్సయినా తిరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో మూడొంతుల ఆర్టీసీ బస్సులను ఇప్పటికే బుక్‌ చేసుకున్నా అనుకున్న లక్ష్యం మేరకు జనాలను తరలించడం కుదరని పరిస్థితి. మిగతా జనాన్ని ప్రైవేట్‌ బస్సులు, ట్యాక్సీ వాహనాలను వేలాదిగా సమకూర్చాల్సిన బాధ్యత. టీఆర్‌ఎస్‌ జిల్లా పార్టీ నేతలు వేస్తున్న అంచనాల ప్రకారమే ఆర్టీసీ బస్సులు పోనూ ఇంకా 2వేల బస్సులు, 5వేలు ప్రైవేట్‌ ట్యాక్సీ వాహనాలు అవసరం అవుతాయి. దీంతో ఇప్పుడు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కనిపించిన వాహనాలను ఎంగేజ్‌ చేసేసుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా ఈ సభకు వెళ్లేందుకు సుమారు 300 కిలోవిూటర్ల దూరభారం పడుతుంది. అప్‌అండ్‌డౌన్‌ కలిసి 600 కిలోవిూటర్ల చొప్పున ఆర్టీసీకి కిలోవిూటర్‌కు చెల్లించే రుసుము లెక్క కట్టినా రూ.కోటి పైబడుతుంది. దీంతో ప్రగతి నివేదనకు టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆర్టీసీకే రూ.కోటి చెల్లించే పరిస్థితి ఉండగా, మిగతా వాహనాల పరంగా చూస్తే సుమారు రూ.5 కోట్లకు పైబడే రవాణాకు వెచ్చించాల్సిన పరిస్థితి. ఉమ్మడి జిల్లాలో జన సవిూకరణ విషయంలో దిశానిర్దేశం కోసం ఆ పార్టీ రాష్ట్ర నాయకులు లోక భూమారెడ్డికి బాధ్యతలు ఇచ్చారు. ఆయన మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుని జనసవిూకరణ కోసం నియోజకవర్గం వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. గ్రావిూణ ప్రాంతాల నుంచి కార్యకర్తలు వెళ్లేందుకు వాహనాలు లేకపోవడంతో వారు సవిూప పట్టణ ప్రాంతాల్లోని వాహనాలను బుకింగ్‌ చేసుకుంటున్నారు. సభకు కార్యకర్తలను తరలించే విషయంలో రవాణా ఖర్చు ఒక ఎత్తు కాగా, ఇప్పుడు వారికి టిఫిన్‌, భోజనాలు, ఛాయ్‌, పానీ ఖర్చులు మోపెడయ్యే పరిస్థితి ఉంది. ఆయా ప్రాంతాల నుంచి ఉదయమే వాహనాలు బయల్దేరుతాయి. ఈ భారాన్ని ఎమ్మెల్యేల భుజాననే వేసినట్లు చెబుతున్నారు. ఈ విషయంలో నియోజకవర్గం వారీగా నిర్వహిస్తున్నసమావేశాల్లో దిశానిర్దేశం చేస్తున్నారు.