ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి.

నెన్నెల, నవంబర్ 1,(జనంసాక్షి):

ఆర్టీసీ అందిస్తున్న సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ చైతన్య కళా బృందం టీం లీడర్‌ సాంబయ్య తెలిపారు. ఆర్టీసీ మంచిర్యాల డిపో మేనజర్ రవీంద్రనాథ్ ఆదేశాల మేరకు మంచిర్యాల డిపో మేనేజర్ మనోహర్ ఆధ్వర్యంలో నెన్నెల మండల కేంద్రంలో “ప్రజల వద్దకే ఆర్టీసీ” అనే కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ సేవలపై కళాకారుల బృందం ప్రదర్శన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాకారుల బృందం ఆర్టీసీ సంస్థ ప్రయాణికులకు కల్పిస్తున్న రాయితీలను ఆయా రకాల పాసుల గురించి పాటల ద్వారా వివరించారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణం ఎంత సురక్షితమో తెలియజేస్తూ, ప్రైవేటు వాహనాల్లో ప్రమాదం ఎంత ప్రమాదకరమో వివరించారు. నిరుద్యోగ యువకులకు లైట్‌ మోటార్‌ వెహికిల్‌ లైసెన్సు కలిగి ఉంటే మంచిర్యాల డిపోలో హేవీ డ్రైవింగ్‌ లైసెన్సులో శిక్షణ ఇచ్చి, రానున్న రోజుల్లో ఆర్టీసీలో ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఆర్టీసీ కార్గో పార్సెల్ సేవల గురించి, వివాహాది శుభ కార్యాలకు ఎటువంటి ముందస్తు అడ్వాన్సు లేకుండా బస్సులు అద్దెకిస్తున్నామని, ఆర్టీసీ కల్పిస్తున్న రాయితీలు వంటి పలు పథకాల గురించి కళాకారులు ఆటపాటతో ప్రజలకు వివరించారు.ఈ కార్యక్రమంలో శంకర్, రాజు, వెంకటస్వామి, రమేష్, శ్రీనివాస్, కుమార్, ఎల్లాస్వామి, శ్రీను, సేఫ్టీ వార్డెన్ రాజమౌళి తదితరులు పాల్గొన్నారు.